Thursday, September 19, 2024

దర్జాగా.. దందా..! టార్గెట్‌ దాటితే స్పెషల్‌ ఆఫర్‌..

మెదక్‌, (ప్రభ న్యూస్‌) : మెదక్‌ జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. తెల్లవారుజామునుంచే గుట్కా ప్యాకెట్లు పల్లెలకు చేరవేసే యంత్రాంగం రెడీ అయ్యింది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నెంబర్‌ ప్లేట్‌లు లేని బైక్‌ ఢీక్కీల్లో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వారికి ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం పల్లెలు, పట్టణాల్లోని కిల్లీకొట్టు కిరాణా దుకాణాలకు చేరవేస్తున్నారు. టార్గెట్‌కు మంచి గుట్కాను అమ్మిన వారికి వ్యాపారులు స్పెషల్‌ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇట్లా గుట్కా బ్యాగుల తరలింపు సమయంలో ఒక వేళ పోలీసులకు దొరికినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సదరు సిబ్బందికి బడా వ్యాపారుల నుంచి ముందుగానే సమాచారం ఉందని తెలుస్తోంది. దీంతో గుట్కా రవాణాకు అడ్డులేకుండాపోతుంది. తెల్లవారు నుంచే మారుమూల మండల కేంద్రాల స్థావరాల నుంచి పల్లె పల్లెకు నిషేధిత గుట్కాలను సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు భారీ వాహనాల్లో కాకుండా నెంబర్‌ ప్లేట్‌ లేని ద్విచక్ర వాహనాలపై స్థానికేతరులను నెలవారీ వేతనాలకు కుదుర్చుకుంటున్నారు. సదరు వాహనదారులు గన్నీ బ్యాగుల్లో యూరియా, డిఏపి ఖాళీ బ్యాగుల్లో సగటున ఒక్కో వాహనంపై ఇద్దరేసి వ్యక్తులు రూ.లక్షలాది సరుకును సరఫరా చేస్తున్నారు. కిరాణా దుకాణానికి వెళ్లి అడిగి కావాలంటే సరుకువేస్తారు. దుకాణదారునికి ముట్టజెప్పే సమయంలో సార్‌ సరుకు కాస్త జాగ్రత్త ఎంక్వయిరీకి వస్తే విషయం ఏమాత్రం చెప్పకండి, ఎటు నుండి వచ్చారు. ఏ వాహనం ఉంది, ఎలాంటి పోలికలు ఉన్నాయని అడిగినా తెలియదని చెప్పాలని ముందస్తుగానే సూచనలిస్తున్నారు. ఉదయం పూట బయలు దేరిన ద్విచక్ర వాహనాలు సాయంకాలం ముగిసే సరికి సరుకు రహస్య స్థావరాలకు చేరుకుంటారు. ఎవరు ఎక్కువ సేల్స్‌ చేస్తే వారికి బంపర్‌ ఆఫర్‌ పెట్టి నట్లు సమాచారం.

అధికారులకు ముందే సమాచారం..

ద్విచక్ర వాహనాలపై మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు జరిగే గుట్కా సరఫరా సంబంధిత వ్యక్తుల వివరాలు అధికారులకు మాత్రం గోప్యంగా ఉందన్న విషయం తెలుస్తోంది. ఆ మండలానికి సంబంధించిన వ్యక్తులు తమ వాహనం, వ్యక్తుల తాలుకా వివరాలు ఆకస్మీకంగా అధికారులకు ఎదురుపడితే తమకేమీ తెలియనట్లు ముఖం తప్పించుకునే కార్యక్రమాలను కూడా ముందస్తుగా సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తనిఖీలపై పెరిగితే అంతకుముందే మారుమూల మండల ప్రాంతాల్లో దొరికే గుట్కా కాస్త తగ్గుముఖం పడుతోంది. వారం పది రోజుల దాక రూ.10, రూ.15 అమ్మిన గుట్కా పొట్లం ఇక్కసారిగా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు కిరాణ వ్యాపారులు, గత కొద్ది రోజుల క్రితం అధికారుల తనిఖీలు ఉన్నాయంటూ గుట్కా సరాఫరా లేదంటే గుట్కా ప్రియుల జేబులను గుళ్ల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామూళ్ల మత్తులో మునిగిన పలువురు అధికారులు గుట్కా అక్రమ క్రయవిక్రయాలపై ఏ మాత్రం దృష్టి సారించలేకపోతున్నారు. అధికారుల్లో కొందరు తమకు కావాల్సిన ఇష్టమైన గుట్కా పొట్లాలకు సదరు ఏజెంట్ల ద్వారా ప్రత్యేకంగా కూడా తెప్పించుకుంటున్నట్లు సమాచారం. అధికారులే అక్రమ వ్యాపారులతో జతకడితే అక్రమ వ్యాపారం గుట్టురట్టు చేసే వారు ఎవరంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement