Thursday, November 21, 2024

కాసులు కురిపిస్తున్న సిజేరియన్లు, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 75శాతం కోతలే

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్ : ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గర్భిణుల ఆర్థిక పరిస్థితులను బట్టి సిజేరియనా… లేక సాధారణ కాన్పు చేయాలా అనేది ప్రైవేట్‌ డాక్టర్లు తేల్చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చేవాళ్లలో ఎక్కువ శాతం మంది ఆర్థికంగా ఉన్న వారే వస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనే నెలనెల చెకప్‌లు చేయించుకుంటుండటంతో అదే ఆసుపత్రిలో డెలివరీలు చేయించుకుంటున్నారు. కాన్పు అయ్యేంత వరకు ఎదురుచూడకుండా వెంటనే సిజేరియన్లు చేసేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. హైదరాబాద్‌ మహానగరం చుుట్టూరా రికార్డు స్థాయిలో ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులను మొదలుకుని గల్లిల్లో ఉండే ఆసుపత్రులు రంగారెడ్డి జిల్లాలో వందకు పైగానే ఉన్నాయి. వారంలో ఒకటి రెండు కాన్పులు జరిగినా వారికి గిట్టుుబాటు అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతఏడాది మార్చి మాసం నుండి ఏప్రిల్‌ వరకు 10,969 డెలివరీలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరిగాయి. ఇందులో 8303కాన్పులు సీజేరియన్‌ చేసినవే కావడం గమనార్హం. కేవలం 2666 కాన్పులు మాత్రమే సాధారణ కాన్పులు జరిగాయి. 75 శాతానికి పైగానే సీజేరియన్లు చేస్తున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.

ముహూర్తాలు చూసుకొని మరీ డెలివరీలు….

ముందుగానే స్కానింగ్‌లో కడుపులో ఉన్నది ఆడ-మగ తెలిసిపోతోంది…ఆడ పిల్ల శుక్రవారం రోజు పుడితే ఇంటికి లక్ష్మీ వచ్చినట్లు చాలామంది భావిస్తున్నారు. అందులో కాన్పు శుక్రవారం రోజు చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. గర్భిణీల కోరిక మేరకు వాళ్లు ఏ రోజు కాన్పు చేయాలంటే అదేరోజు కాన్పులు చేసేస్తున్నారు. ఒకటి లేదా రెండురోజులు ఆసుపత్రిలో ఉండి ఇళ్లకు వెళ్లిపోతున్నాయి. ఇందుకు గాను ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. సామాన్యులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితులు ఎంతమాత్రం కనిపించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తే మాత్రం జేబులకు చిల్లులు పడ్డట్లే. తొలి కాన్పు పుట్టింటి వాళ్లు చేయించాల్సి ఉంటుంది. దీంతో చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వెనకా ముందు చూడకుండా దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం నార్మల్‌ డెలివరీలే….

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం సీజేరియన్లు చేస్తుండగా దానికి భిన్నంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతోంది. 80 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. నిరుపేద గర్భిణీలు ఎక్కువ శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. డబ్బులు లేకుండా కాన్పులు జరగడం కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేయడం…డెలివరీ చేయించుకుంటే డబ్బులు కూడా ఇస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగిపోతున్నాయి. గత మార్చి మాసం నుండి ఏప్రిల్‌ వరకు జిల్లాలో 10,025 కాన్పులు జరిగాయి. ఇందులో కేవలం 2988 కాన్పులు మాత్రమే సీజేరియన్‌ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పుల కోసం చాలా సేపు ఎదురు చూస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్లు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్‌ ఆసుపత్రులకు చాలా తేడా ఉంది. ప్రైవేట్‌లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం కాన్పులు తక్కువగా జరుగుతున్నాయి.

- Advertisement -

ఆడిట్‌ఫాం అమలెక్కడా….

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ఆడిట్‌ఫాంలో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో దీనిని అమలు చేయడం లేదు. అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖ ఆడిట్‌ ఫాంలు పంపిణీ చేసింది. గర్భిణీకి సిజేరియన్‌ చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ఆడిట్‌ ఫాంలో నమోదు చేయాల్సి ఉంటుంది. కారణం లేకుండా సిజేరియన్లు చేసేందుకు వీలు లేదు. తమ ఇష్టానుసారం సిజేరియన్లు చేస్తే మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తే మాత్రం సంబంధిత గైనకాలజిస్టు పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కారణం లేకుండా సిజేరియన్లు చేస్తే మాత్రం మెడికల్‌ సర్టిఫికెట్‌ కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదు…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement