- ప్రజా కోర్టులో ప్రభుత్వానికి శిక్ష తప్పదు..!
- నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రజల కోసం పోరాడుతాం..
- ఇంద్రవెల్లి వీరుల త్యాగాలే మాకు స్ఫూర్తి..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ప్రజల పక్షాన గొoతెత్తి ప్రశ్నించే వారిపై రేవంత్ రెడ్డి సర్కారు అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి స్మారక స్థూపం వద్ద ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం పోరాడిన ఆదివాసుల అమరుల త్యాగాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, 4.5 లక్షల ఎకరాల భూములకు కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు అందించి ఆదుకుందన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులతో భయపెడుతోందన్నారు. ఏసీబీ కేసులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేదే లేదని, నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు భరోసాపై మాట తప్పిన ప్రభుత్వం…
రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. రూ.12వేలకు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని కవిత అన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని ఆరోపించారు. అంతిమంగా ప్రజా కోర్టులో అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ కు శిక్ష తప్పదని కవిత అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు కవితకు ఏజెన్సీలో ఘన స్వాగతం పలికారు.