Thursday, November 21, 2024

TG | గంజాయి కేసులో ఐఐటీ విద్యార్థి అరెస్ట్ !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఐఐటీ విద్యార్థిని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌లో ఓ ప్రైవేట్‌ పీజీ హాస్టల్లో ఉంటూ పవన్‌ ఐఐటీ అభ్యసిస్తున్నాడు. అయితే కొద్ది కాలంగా పవన్‌ గంజాయి విక్రయిస్తున్నాడని ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఆర్‌ నగర్‌లో పవన్‌ ఉంటున్న పీజీ హాస్టల్‌ గదిలో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేయగా 1.5 కిలోల గంజాయి లభ్యమైంది.

దీంతో పోలీసులు పవన్‌ను అరెస్ట్‌ చేసి అతనితో సంబంధం ఉన్న మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో ఐఐటీ విద్యార్థి కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌, లోకేష్‌లకు 2.5 కిలోల గంజాయిని విక్రయించినట్లు తేలింది.

హాష్‌ అయిల్‌ స్వాధీనం..

హైదరాబాద్‌ నగరంలో భారీగా హాష్‌ ఆయిల్‌, గంజాయి చాక్లెట్లను అధికారులు పట్టుకున్నారు. హాష్‌ ఆయిల్‌ కేసులో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 2.5 లీటర్ల హాష్‌ ఆయిల్‌, 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను అధికారులు సీజ్‌ చేశామన్నారు.

ఎస్‌వోటి ఎల్‌బీ నగర్‌ జోన్‌ బృందం దాదాపు హాష్‌ అయిల్‌ ముఠాను పట్టుకోని దాదాపు రూ. 21 లక్షల విలువైన డ్రగ్‌ను సీజ్‌ చేశారన్నారు. ఎస్‌వోటీ మహేశ్వరం జోన్‌ బృందం, ఆదిబట్ల పోలీసుల సహకారంతో గంజాయి చాక్లెట్లు విక్రయించే వ్యక్తిని పట్టుకున్నారని, గంజాయి చాక్లెట్ల కేసులో ఓ నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు.

హాష్‌ ఆయిల్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైజాగ్‌ నుంచి తీసుకొస్తున్నట్లు విచారణలో తేలిందని, అలాగే గంజాయి చాక్లెట్లు బీహార్‌ నుంచి తెచ్చి విక్రయా చేస్తున్నట్లు కీలక ఆధారాలు సేకరించినట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ మధ్య గంజాయి చాక్లెట్లు మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, వీటి తయారీ వెనుక ఉన్న వారిని అదుపులోకి తీసుకోనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement