Friday, November 22, 2024

Delhi | ఐఐటీ-మద్రాస్ టాప్.. 14వ స్థానంలో ఐఐటీ-హైదరాబాద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) – మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) నిలవగా, ఐఐటీ-ఢిల్లీ 3వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది.

ఇక యూనివర్సిటీల విభాగంలో మొదటి స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) నిలవగా.. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రెండో స్థానంలో, జామియా మిలియా ఇస్లామియా 3వ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం దక్కించుకుంది. కళాశాలల విభాగంలో ఢిల్లీలోని మిరిండా హౌజ్ మొదటి స్థానంలో, హిందు కాలేజ్ రెండో స్థానంలో నిలిచాయి. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ 3వ స్థానం దక్కించుకుంది. కాలేజీల విభాగంలో తొలి 100 స్థానాల్లో హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ వుమెన్ మాత్రమే (98వ స్థానం) చోటు దక్కించుకుంది.

రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ కేటగిరీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) మొదటి స్థానంలో, ఐఐటీ (మద్రాస్) 2వ స్థానంలో, ఐఐటీ (ఢిల్లీ) 3వ స్థానంలో నిలిచాయి. ఈ విభాగంలో ఐఐటీ (హైదరాబాద్) 14వ స్థానంలో నిలవగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 28వ స్థానంలో నిలిచింది.

- Advertisement -

ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ (మద్రాస్) అగ్రస్థానంలో నిలవగా, వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ (ఢిల్లీ), ఐఐటీ (బాంబే), ఐఐటీ (కాన్పూర్), ఐఐటీ (రూర్కీ) నిలిచాయి. ఐఐటీ (హైదరాబాద్) 8వ స్థానం దక్కించుకుంది. ఎన్ఐటీ (వరంగల్) 21వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ (హైదరాబాద్) 55వ స్థానంలో నిలిచాయి.

మేనేజ్మెంట్ విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో ఐఐఎం (బెంగళూరు), ఐఐఎం (కోజికోడ్) నిలిచాయి. ఐఐఎం (విశాఖపట్నం) 29వ స్థానం దక్కించుకుంది.

ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్) అగ్రస్థానం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (విశాఖపట్నం) 22వ స్థానంలో నిలిచింది.

వైద్య విద్యలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మూడో స్థానంలో వెళ్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి నిలిచాయి. తొలి 50 స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క మెడికల్ కాలేజీ కూడా చోటు దక్కించుకోలేకపోయింది. డెంటల్ విభాగంలో సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ (చెన్నై) మొదటిస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో భీమవరంలోని విష్ణు డెంటల్ కాలేజి 26వ స్థానం దక్కించుకోగా సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 33వ స్థానంలో నిలిచింది.

లా విభాగంలో బెంగళూరులోని నేషనల్ స్కూ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నేషనల్ లా యూనివర్సిటీ (న్యూఢిల్లీ), నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్) నిలిచాయి.

ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ (రూర్కీ) మొదటి స్థానంలో, ఎన్ఐటీ (కాలికట్) 2వ స్థానంలో, ఐఐటీ (ఖరగ్‌పూర్) 3వ స్థానంలో నిలిచాయి. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 18వ స్థానం దక్కించుకుంది.

తొలిసారిగా ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన వ్యవసాయం – అనుబంధ విభాగాల్లో న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఐసీఏఆర్ – నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కర్నాల్), 3వ స్థానంలో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (లూథియానా) నిలిచాయి. ఈ విభాగంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (గుంటూరు) 20వ స్థానంలో, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (తిరుపతి) 31వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్మెంట్ 32వ స్థానం దక్కించుకుంది.

ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ (కాన్పూర్) మొదటి స్థానంలో నిలవగా, ఐఐటీ (మద్రాస్), ఐఐటీ (హైదరాబాద్) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement