Tuesday, November 19, 2024

TS | తెలంగాణాకు ఐఐహెచ్‌టీ మంజూరు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్స్‌ టెక్నాలజీని (ఐఐహెచ్‌టీ) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఐఐహెచ్‌టీతో జౌళీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు.

ఐఐహెచ్‌టీతో రాష్ట్ర విద్యార్థులకు కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో చేనేత, జౌళి పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కుటు-ంబాలు జీవిస్తున్నాయి. ఏళ్లుగా సంప్రదాయ పద్ధతులను నమ్మకొని మగ్గాలపై చీరెలు, చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చేనేత సాంకేతిక కోర్సుల వైపు చూస్తుండగా.. రాష్ట్రంలో కోర్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీకి పేరుంది. విద్యకు ఐఐటీ- మాదిరిగా చేనేతకు ఐఐహెచ్‌టీని పరిగణిస్తుండగా.. ఇందులో కోర్సులకు మంచి డిమాండ్‌ ఉన్నది.

- Advertisement -

ఈ క్రమంలో భూదాన్‌ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీని నెలకొల్పాలని గత ప్రభుత్వం 2017లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఐఐహెచ్‌టీకి భారీ డిమాండ్‌ ఉండడంతో తెలంగాణలోనూ ఐఐహెచ్‌టీ-ని నెలకొల్పాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అప్పటి చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్‌ సైతం కేంద్రమంత్రులకు లేఖలు సైతం రాసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి ఎట్టకేలకు ఫలితం దక్కినట్లయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement