Friday, November 22, 2024

గ్రూప్‌-1 పరీక్ష రాయాలంటే చెప్పులేసుకోవాల్సిందే.. షూ వేసుకొనివెళ్తే నో ఎంట్రీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపు (ఆదివారం) గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 33 జిల్లాల్లో 1019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాలో కనిష్టంగా 7 సెంటర్లు, గరిష్టంగా 128 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జంబ్లింగ్‌ విధానాన్ని, బయోమెట్రిక్‌ హాజరును అమలు చేస్తున్నారు. అభ్యర్థులకు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే (10.15) గేటు మూసివేస్తారు.

అభ్యర్థులు షూ ధరించొద్దు. చెప్పులు వేసుకొనే పరీక్షకు వెళ్లాలి. మెహందీ, ఆభరణాలను నిషేధించారు. అయితే తాళి బొట్టు వేసుకొని వెళ్లొచ్చు. హాల్‌టికెట్‌తో పాటు పాస్‌ పోర్టు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. తమ వెంట మూడు ఫోలోలు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌పై అభ్యర్థి తన ఫోటోను అతికించి సంతకం చేయాలి. మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌, వాచ్‌, కాలిక్యులేటర్‌, పర్స్‌, నోట్స్‌, కీ చైన్లు, ఇన్‌హేలర్లు ఉన్న కీలు, వస్తుసామాగ్రిని అనుమతించరు. చేతి కర్చీఫ్‌లు తెచ్చుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మందులు తెచ్చుకోవచ్చు. వైట్‌నర్‌, ఎరేజర్‌, చాక్‌పీస్‌, బ్లేడ్‌ వంటివి పరీక్షలో ఉపయోగించరాదు. సమయం తెలుసుకునేదుందు ప్రతి అరగంటకు ఓ సారి గంట మోగిస్తారు. ఎటువంటి స్కెచ్‌ పెన్నులు, కలర్‌ పెన్సిళ్లు అనుమతిలేదు. బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే బబ్లింగ్‌ చేయాలి. పరీక్ష కేంద్రాల్లో వాటర్‌ బాటిళ్లను అనుమతించరు. ఓఆర్‌ఎస్‌, మంచి నీరు అందుబాటులో ఉంచుతారు. కూలింగ్‌ గ్లాసులను అనుమతించరు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement