Monday, November 25, 2024

మాకు ఓటేస్తే, సిటీ బస్‌లో జర్నీ ఫ్రీ.. బెంగళూరు మహిళలతో రాహుల్‌ మాటామంతీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(బీఎంటీసీ) కు చెందిన బస్సులో సోమవారం నగరంలో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. అంతకుమునుపు కన్నింగ్‌హ్యామ్‌ రోడ్డులో కాఫీ డే షాప్‌ను ఆయన సందర్శించారు. అక్కడి కాఫీ ప్రియులతో ముచ్చటించారు. పనిలోపనిగా ఓ కప్పు కాఫీ తాగారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న బస్టాప్‌కు నడుచుకుంటూ వెళ్ళి చేరుకున్నారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళలు, కాలేజీ విద్యార్థినులను కలుసుకున్నారు. దైనందిన జీవితంలో బస్సు ప్రయాణంలో పడే ఇక్కట్లు, చదువుకోవడంలో ఎదుర్కొనే ఇబ్బందులు, తాము మోస్తున్న కుటుంబ బాధ్యతల గురించి వారు రాహుల్‌ గాంధీతో పంచుకున్నారు.

ఆ తర్వాత మహిళలు, విద్యార్థినులతో పాటుగా ఆయన సిటీ బస్సు ఎక్కారు. కర్నాటకలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ప్రతి గృహిణికి రూ.2,000 అందజేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో మహిళలు, గృహిణులు, విద్యార్థినులకు ఇచ్చిన హామీలను బస్సులో ప్రయాణిస్తూనే వారికి రాహుల్‌ గాంధీ వివరించారు. ఈ హామీలపై అవగాహన ఉందా అని వారి ప్రశ్నించారు. మహిళా ప్రయాణికులు వారు పడుతున్న కష్టాలను మరీ ముఖ్యంగా ధరల పెరుగుదల వారి బడ్జెట్‌లపై, వారి జీవితాలపై చూపుతున్న దుష్ప్రభావాన్ని కాంగ్రెస్‌ నేతతో పంచుకున్నారు. ఆ తర్వాత లింగరాజపురంలో సిటీ బస్సును ఆయన ఎక్కారు. బస్సులో మహిళలు, యువతీయువకులతో ముచ్చటించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement