Friday, November 22, 2024

పదేపదే వస్తువులు చేజారితే.. తస్మాత్‌ జాగ్రత్త! అనారోగ్య సమస్యలకు అదో రకమైన సంకేతం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: దైనందిన జీవితంలో మనిషికి తెలియకుండానే అనేక వ్యాధులకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తుంటాయి. కానీ, ఇప్పుడున్న ఉరుకుల, పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ అలాంటి సూక్ష్మ హెచ్చరికలను పట్టించుకునే అవకాశమే లేకుండా పోయింది. విద్య, ఉద్యోగం, ఉపాధి.. తదితర నిత్య జీవన పోరాటంలో మనిషి తన శరీరంలో సంభవించే మార్పులను నూటికి 99శాతం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు లోలోపల వ్యాధులు ముదిరి ఆస్పత్రి పాలయ్యే దాకా తెచ్చుకుంటున్నారు. ఇదే అంశంపై వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూ.హెచ్‌.వో) తాజాగా ఓ లోతైన అధ్యయనం నిర్వహించింది. ఈ తాజా వైద్య విజ్ఞాన అధ్యయనాన్ని ”జర్నల్‌ ఆఫ్‌ అల్జిమర్స్‌” బాహ్య ప్రపంచానికి వెల్లడించింది.

- Advertisement -

పదేపదే వస్తువులు చేయి జారి పడిపోతుంతే, తేలికగా కొట్టిపారేయొద్దు తస్మాత్‌ జాగ్రత్త.. అంటూ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా తరచూ జరుగుతుండడంతో అనారోగ్య సమస్యలకు అదో రకమైన సంకేతం కావచ్చునని చెబుతున్నారు. కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, నరాల పటుత్వానికి సంబంధించిన అనారోగ్యం అయ్యే అవకాశం, ప్రమాదం.. రెండూ పొంచి ఉండొచ్చని డబ్ల్యూ.హెచ్‌.వో అధ్యయనం స్పష్టం చేసింది. మనిషికి ప్రాణహాని కలిగించే కీలకమైన అవయవాలు గుండె, మెదడుకి సంబంధించిన సమస్య ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అదే సమయంలో ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌, ట్రాప్ట్‌ నెర్వ్‌ ప్రభావం కూడా వస్తువులు చేజారిపోవడానికి కారణం కావచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల మన దేశంలో కేవలం నిర్లక్ష్యం కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవనశైలి తదితర కారణాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి.

మీ చేతులు పట్టు తప్పుతుంటే.. మీరు త్వరలోనే భారీ అనారోగ్యానికి గురవుతున్నారన్న సంకేతంగా భావించాలి. మీ చేతుల్లోంచి తరచూ వస్తువులు జారి కిందపడిపోతున్నాయా?.. అయితే, మీరు గుండెకు సంబంధించిన లేదా మెదడుకు సంబంధించిన, ఇంకా గట్టిగా చెప్పాలంటే నాడీ వ్యవస్థకు, నరాల పటుత్వానికి సంబంధించిన అనారోగ్యానికి చేరువ అవుతున్నారని అర్థం. ఇటీవల వైద్య పరిశోధనలు ఈ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాయి. సాధారణంగా ఇలా చేయి పట్టుచిక్కకపోవడాన్ని, పట్టుజారిపోవడాన్ని ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. తరచూ చేతుల్లోంచి చిన్నచిన్న వస్తువులు కూడా జారి కిందపడిపోవడాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ అవన్నీ పూర్తిగా మీకు త్వరలోనే గుండెకు, మెదడుకు, నాడీ వ్యవస్థకు లేదా నరాల బలహీనతకు సంబంధించిన తీవ్రస్థాయి అనారోగ్యం కలగబోతోందన్న హెచ్చరికలకు సంకేతాలని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా మీ శరీరానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలు, అనారోగ్యాలకు ఇలా పట్టు జారిపోవడాన్ని సూచనగా భావించాలని చెబుతున్నారు. ఇటీవల జర్నల్‌ ఆఫ్‌ అల్జిమర్స్‌లో ప్రచురితమైన ఓ ప్రత్యేకమైన అధ్యయనం ఈ నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మీ చేతులు పట్టుతప్పడం, పట్టుజారిపోవడం త్వరలోనే మీకు చిత్తవైకల్యానికి సంబంధించిన జబ్బులు రావడానికి సూచనగా భావించాల్సి ఉంటుందని ఈ జర్నల్‌ ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి సాధారణంగా కనీసం 40 కేజీల బరువును అలవోకగా మోయగలుగుతాడు. దానిపై తనకు కచ్చితంగా పట్టు ఉంటుంది. ఈ సామర్ధ్యం ఎంతో కొంత తగ్గినా సరే కచ్చితంగా అది రాబోయే రోజుల్లో కొని తెచ్చుకోబోయే అనారోగ్యానికి సంకేతమని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రతి ఐదు కిలోల బరువుకూ ఈ సామర్ధ్యాలు తగ్గుతున్నకొద్దీ దాదాపుగా 18 శాతం మీరు పైన చెప్పుకున్న ఆనారోగ్యాలకు చేరువ అవుతున్నట్టే లెక్కని వైద్యులు అంటున్నారు. చేతుల్లో పట్టు చిక్కడం మొత్తంగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సూచనలని అమెరికాలో జరిగిన వైద్య పరిశోధనల్లో తేలింది. దాదాపుగా 40 సంవత్సరాల వయసు దాటిని దగ్గరినుంచీ ఈ సామర్ధ్యం మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే మెల్లమెల్లగా కండరాల బిగువుకూడా తగ్గిపోతున్నట్టు లెక్కని అంటున్నారు. అయితే దీని ప్రభావం పూర్తి స్థాయిలో అప్పటికప్పుడే కనిపించాల్సిన అవసరం లేదనీ, 70 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో దానివల్ల ఎదురయ్యే విషమ పరిణామాలు బయటపడతాయని చెబుతున్నారు.

ప్రతి రోజు వ్యాయామం శిరోధార్యం..

దాదాపుగా ప్రతి మనిషికీ ఒక దశాబ్దానికి 3 నుంచి 5 శాతం మజిల్‌ మాస్‌ పవర్‌ తగ్గిపోతుందని వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని మిగతా అవయవాల పటుత్వం కోసం రోజూ వ్యాయామం చేసేవాళ్లే తప్ప చేతుల్లోని, మణికట్టులోని కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసేవాళ్లు సంఖ్య పెద్దగా కనిపించదని నిపుణులు అంటున్నారు. కేవలం చిన్న చిన్న గ్రిప్పులు, స్మైలీ బాల్స్‌ సాయంతో రోజూ కొంత సేపు ప్రత్యేకంగా చేతి కండరాలను బలపరచుకునేందుకు వ్యాయామం చెయ్యాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌ లేదా ట్రాప్ట్‌ నెర్వ్‌ లాంటి ఇబ్బందులవల్ల పూర్తి స్థాయిలో చేతులు పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement