Friday, November 22, 2024

Spl Story : ఫిట్’లెస్’ బ‌స్సులు !

  • నాలుగువేల బస్సులకు ఫిట్‌నెస్‌
  • వెయ్యికి పైగానే బస్సులు దూరం
  • ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కితే కేసులే
  • ఫిట్‌లెస్‌ బస్సులపై రవాణాశాఖ కొరడా
  • పది బస్సులు సీజ్‌
  • తనిఖీలు కొనసాగించనున్న రవాణాశాఖ

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : రవాణా శాఖ అధికారులు ఎన్ని విధాల కట్టడీలు చేసినా ఫిట్‌లెస్‌ లేకుండా బస్సులు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. దొరికితేనే దొంగలుగా పరిస్థితి మారిపోయింది. దాదాపుగా నెలరోజులపాటు రవాణాశాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సమయంలో ఫిట్‌నెస్‌ లేని వాహనాలను షెడ్డులకే పరిమితం చేస్తున్నారు… తనిఖీలు తగ్గిన తరువాత ఎప్పటిమాదిరిగానే ఫిట్‌లెస్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయి. జిల్లాలో ఐదువేలకు పైగానే బస్సులున్నాయి. ఇందులో నాలుగువేల బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించుకున్నారు. వెయ్యికి ఫైగానే బస్సులు ఫిట్‌గా లేని పరిస్థితులు. ఆ బస్సులు షెడ్లలో ఉన్నాయా లేక కాలేజీలు, స్కూళ్లలో భద్రంగా ఉంచారా అనేది తేలాల్సి ఉంది. ఫిట్‌నెస్‌ చేయించని బస్సుల విషయంలో రవాణాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. మొదటిరోజు ఏకంగా పది బస్సులను సీజ్‌ చేసింది. తనిఖీల ప్రక్రియ కొనసాగుతుందని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కాలేజీలు, స్కూళ్లు ఉన్నాయి. వీళ్లు విద్యార్థులను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాలో ఐదువేలకు పైగానే ప్రైవేట్‌ బస్సులున్నాయి. హైదరాబాద్‌కు పక్కనే ఉండటంతో ఇక్కడ విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం కొత్తకొత్త కాలేజీలు…స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు ఇబ్బందిగా మారడంతో చాలామంది విద్యార్థులు కాలేజీలు, స్కూళ్లు ఏర్పాటు చేసే బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. మెజార్టీ విద్యార్థులు కాలేజీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. ఆ బస్సులు ఫిట్‌గా ఉంటేనే రోడ్డెక్కాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో ప్రైవేట్‌ బస్సులు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఉంటేనే రవాణాశాఖ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. అనుకున్న సమయానికి బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించడంతో యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం గడువు ముగిసిన తరువాత కూడా ఫిట్‌నెస్‌ చేయించడం లేదు. దీంతో ప్రతి ఏటా జూన్‌ 12వ తేదీనుండి రవాణాశాఖ అధికారులు ఫిట్‌నెస్‌ లేని బస్సులు సీజ్‌ చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో ఐదువేలకు పైగానే ప్రైవేట్‌ బస్సులున్నాయి. ఇందులో గడువు లోగా నాలుగు వేల బస్సులు ఫిట్‌నెస్‌ చేయించారు. ఇంకా వెయ్యికి పైగానే బస్సులు ఫిట్‌నెస్‌ చేయించలేదు. నిబంధనల ప్రకారం జూన్‌ 12వ తేదీ లోగానే బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంటుంది. ఇంకా ఫిట్‌నెస్‌ చేయించని బస్సులున్నాయి. కావాలనే ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ చేయించేందుకు ఆసక్తి చూపించడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని రోజులపాటు బస్సులను షెడ్‌లకో లేక కాలేజీలు, స్కూళ్ల కు పరిమితం చేస్తున్నారు. తనిఖీల ప్రక్రియ ముగిసిన తరువాత వాటిని రోడ్లపైకి తీసుకవస్తారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

నిబంధనలు పాటిస్తేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌..
అన్ని నిబంధనలు పక్కాగా అమలు చేస్తేనే రవాణాశాఖ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. సెలవులు ముగియగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ కొందరూ బస్సుల యాజమానులు నిబంధనలను అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. పిల్లులు బస్సులు ఎక్కేందుకు వీలుగా స్టెప్పులుండాలి. తప్పనిసరిగా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉండాలి…డ్రైవర్‌కు తప్పనిసరిగా లైసెంస్‌ ఉండాలి….బస్సులో అటెండర్‌ మస్టుగా ఉండాలి…బస్సుపై విధిగా ఫోన్‌ నంబర్లు రాయించాలి ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి. చాలా కాలేజీ, స్కూళ్ల బస్సుల్లో అటెండర్లు ఉండటం లేదు. డ్రైవర్‌ ఒక్కరే ఉంటున్నాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎవరికి ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేసేందుకు కావల్సిన కిట్టు తప్పనిసరిగా బస్సులో ఉండాలి. బస్సులో అటెండర్‌ పాత్ర కూడా కీలకం. బస్సుల్లో అటెండర్లు లేకపోవడంతో చిన్న పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. బస్సు ఆగిన తరువాతే పిల్లలు బస్సు దిగేలా చూసుకోవడం..బస్సు రివర్స్‌ వస్తున్నప్పుడు బస్సు వెనకాలే ఉండి రూట్‌ అటెండర్‌ చెప్పాల్సి ఉంటుంది. బస్సు దిగగానే చిన్న పిల్లలు వెంటనే పరిగెత్తుకెళ్లడం అలవాటు అలా బస్సు వెనక్కి వెళ్లగానే బస్సును డ్రైవర్‌ వెనక్కి తీయడంతో ప్రమాదాలు జరిగి విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాలేజీ బస్సుల్లో మాత్రం అటెండర్లు మచ్చుకైనా కనిపించడం లేదు.

ఫిట్‌లెస్‌ బస్సులపై రవాణాశాఖ కొరడా..
ఫిట్‌లెస్‌ బస్సులపై రవాణాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. మొదటిరోజు సోమవారం నాడు పది బస్సులు సీజ్‌ చేశారు. ప్రైవేట్‌ బస్సులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో రవాణాశాఖ తనిఖీలు చేపట్టింది. టిప్పుఖాన్‌ బ్రిడ్జి, హయత్‌నగర్‌, తుక్కుగూడ, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పది బస్సులు సీజ్‌ చేశారు. బస్సులు ఫిట్‌నెస్‌ చేయించుకునేంత వరకు తనిఖీలు కొనసాగిస్తామని రవాణాశాఖ డిప్యూటి కమిషనర్‌ ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. ఫిట్‌నెస్‌ చేయించుకోని వాళ్లు వెంటనే చేయించుకోవాలని లేకుంటే బస్సులు సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement