హైదరాబాద్ శివారులో నిన్న వాకింగ్ కోసం బయటకు వచ్చిన తల్లీకూతుళ్లు కారుకింద పడి చనిపోవడంపై టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ‘‘ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం వల్ల మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన అమాయకులైన తల్లీకూతుళ్లు చనిపోయారని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం మరో ఇద్దరిని గాయాలపాలు చేసింది. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పిల్లల మీద అతిప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
హైదర్‌షాకోట్‌లోని లక్ష్మీ నరసింహ కాలనీలో నివసించే నెమలి అనురాధ(48), ఆమె కుమార్తె(26) మంగళవారం ఉదయం వాకింగ్ కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. సమీప కాలనీకి చెందిన కవిత (36)తో కలిసి వారు బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ వాకింగ్ చేస్తుండగా మలుపు వద్ద ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో, ముగ్గురూ 10 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. వారికీ సమీపంలోనే నడుస్తూ వెళుతున్న ఇంతియాజ్ ఆలం ఖాన్‌ను కూడా కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. కవిత, ఆలంఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.