న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అప్పులు ఎక్కువ చేశారంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గన మీడియా సమావేశం అనంతరం సాయంత్రం టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీలు.. మీడియా వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. తొలుత కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. 2014 నుండి 2019 వరకు తీసుకున్న రుణాలు క్రమబద్దీకరించలేదని, అంతే తప్ప దుర్వినియోగం కాలేదని తెలిపారు. ఈ రెండింటికీ తేడా తెలియనివాళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం విలువ రూ. 8.5 లక్షల కోట్ల వరకు ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాం నాటికి ఉన్న రూ. 2 లక్షల కోట్లు అప్పు మినహాయిస్తే ఈ మూడేళ్లలోనే రూ. 6.5 లక్షల కోట్లు అప్పు చేశారని కనకమేడల అన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హాయంలో ఎన్ని అప్పులు తీసుకొచ్చారో, జగన్ హయాంలో ఎన్ని అప్పులు చేశారో వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు.
మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకతతో వైఎస్సార్సీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని, అందుకే ఇంకా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక మంత్రి వాస్తవాలు కప్పిపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంతసేపూ చంద్రబాబుపై విమర్శలు చేయడం తప్ప మరే పని లేదని, చివరకు ఢిల్లీ వచ్చినా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని అడగకుండా చంద్రబాబును తిట్టిపోయడంపైనే దృష్టిపెట్టారని మండిపడ్డారు. కేవలం తిట్టడం కోసమే ఢిల్లీకి రావడం ప్రజాధానం వృధా చేయడం తప్ప మరేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి ఎన్నో మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక ఆరోగ్య సమస్య ఏదో కారణమై ఉంటుందన్న అనుమానం వస్తోందని అన్నారు. విశాఖపట్నం నగరాన్ని ఏదో చేస్తామంటున్న వైఎస్సార్సీపీ నేతలు, ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడ్డం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ జైలుకు వెళ్లకుండా ఎంపీలు రక్షణ కవచంలా ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం గాలికొదిలేశారని విమర్శించారు.
మీడియా సమావేశంలో ఎంపీలతో పాటు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక మంత్రిలా కాకుండా జగన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు డబ్బులిచ్చి తాగాలని చెబుతున్నారని, ప్రజలు తాగితే డబ్బులు సంపాదించి ప్రభుత్వాన్ని నడపాలని అనుకోవడాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు. ఇసుక, మద్యం అన్నింటికీ నగదు చెల్లింపులేనా అని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.