Tuesday, November 26, 2024

రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని మీరు మాకు నీతులు చెబుతారా…? : బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయాలని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వడం రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు, రాజ్యాంగబద్ధ పదవులను అవమానించడమేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని పదే పదే అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లను, ప్రధానిని, రాష్ట్రపతిని కూడా కేసీఆర్ గౌరవించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

“ఉప ఎన్నికల్లో  గెలిచిన ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసి, మొత్తం సెషన్ సస్పెండ్ చేసిన మీరు మాకు నీతులు చెప్పాలా?” అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిసారి రాజీనామాకు సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. వాళ్లు రాజీనామా చేయాల్సిన పని లేకుండానే 3-4 నెలల్లో ఎన్నికలు రాగానే ప్రజలు వారిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, తాము ఎవరి రాజీనామాలు కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement