Tuesday, November 26, 2024

Delhi: వస్తామంటే బరాబర్ తీసుకుంటాం, చేర్చుకోవడం తప్పేమీ కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీలో చేరాలనుకునేవారితో బేరసారాలకు చోటు లేదని, చేరేవారు నేరుగా పార్టీ నేతలను సంప్రదించవచ్చని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం కోసం కొందరు వ్యక్తులు బేరసారాలు సాగించినట్టుగా విడుదలైన ఆడియో టేపులపై ఆయన స్పందించారు. పార్టీ పేరు చెప్పి ఎవరో స్వామీజీ మాట్లాడితే తమకేం సంబంధమని ఆయన ప్రస్నించారు. ఆయనకేమీ తాము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాసివ్వలేదని, చేర్చుకోవాలంటే తామే నేరుగా మాట్లాడతాం తప్ప మధ్యవర్తులతో పనిలేదని అన్నారు.

పార్టీలో చేరికల కోసం ఈటల రాజేందర్ నేతృత్వంలో ఒక కమిటీయే ఉందని, పార్టీలో చేర్చుకోవడంలో తప్పేం ఉందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ప్రతిరోజూ వందలు, వేల సంఖ్యలో ప్రజలు తమ పార్టీని ఆశ్రయించే పరిస్థితుల్లో చేర్చుకునేవారికి డబ్బులివ్వాల్సిన అవసరం తమకెందుకు ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు చేర్చుకున్నవారికి తాము డబ్బులిచ్చి చేర్చుకున్నామా అంటూ ప్రశ్నించారు. చేరేవారు నేరుగా తననుగానీ, తమ పార్టీ నేతలను గానీ సంప్రదించవచ్చని, మధ్యవర్తులతో పనిలేదని స్పష్టం చేశారు. మధ్యవర్తుల పేరు చెప్పి టీఆర్ఎస్ అల్లిన కట్టుకథ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా బూమ్‌రాంగ్ అయిందని ఎద్దేవా చేశారు.

బీజేపీలో చేరేవారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టులు ఉండవని, అలాగే ఏ కేసుల నుంచి రక్షణ కూడా ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్లు, సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులయ్యేవారు చేరవచ్చని తెలిపారు. అయితే పార్టీలో చేరేవారు తమ పదవులు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ కేసుల నుంచి రక్షణ ఉంటుందని ఎవరో స్వామీజీ చెబితే.. నిజమైపోతుందా అని ప్రశ్నించారు. స్వామీజీ సీబీఐ చీఫో, ఈడీ చీఫో కాదని, అలాంటివాళ్లు మాట్లాడిన మాటలకు బీజేపీ నేతలను ప్రశ్నించడం తగదని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

ఇక నందు కుమార్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రశ్నించగా.. అతను తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పలు సందర్భాల్లో తనను కలిశాడని. అంతమాత్రాన అతనితో సంబంధాలు ఎలా అంటగడతారని అన్నారు. రోజూ వందలాది మంది కలిసి ఫొటోలు దిగుతారని.. నందు కుమార్ టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ సహా హర్షవర్ధన్ రెడ్డి, దానం నాగేందర్.. ఇలా చాలామందితో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.

మా ఎజండాలో లేదు
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ ఎజెండాలో లేదని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని, అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరమేంటని అన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల్లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ప్రభుత్వాలు కూలిపోతే తాము ప్రభుత్వాలని ఏర్పాటు చేశాం తప్ప ఎక్కడా కూల్చలేదని కిషన్ రెడ్డి అన్నారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొంటారన్న ఆరోపణలకు బదులిస్తూ.. నిజానికి బీజేపీలో చేరినవారికి ఆర్థికంగా ఎలాంటి లాభం లేకపోగా కష్టనష్టాలే ఉంటాయని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పెడుతున్న ఖర్చును తట్టుకోలేక, ఖర్చుపెట్టడానికి డబ్బులేక తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement