Tuesday, November 26, 2024

రాజకీయ వైరం ఉంటే విచారణే వద్దంటారా.? వర్ల రామయ్య తరఫు న్యాయవాదికి బెంచ్ కౌంటర్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారమే లేదంటే ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటికీ రక్షణ కల్పించినట్టే కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ముందు వరుసగా రెండ్రోజులు వాదనలు జరిగాయి. నిన్న (బుధవారం) జరిగిన వాదనల్లో హైకోర్టు తీర్పును తప్పుబడుతూ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

ఇవ్వాల (గురువారం) ప్రతివాది వర్ల రామయ్య తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’, అంతకంటే ముందు ఏర్పాటైన కేబినెట్ సబ్-కమిటీ, గత ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులపై దర్యాప్తు కోసం ఆదేశిస్తూ విడుదల చేసిన జీవోలు అన్నీ కూడా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని తెలిపారు. అమరావతి భూముల కొనుగోళ్లు, ఫైబర్ నెట్ పథకం వంటి వాటిలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందని, కానీ సీబీఐ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. దాంతో అమరావతి భూముల కేసులపై సీఐడీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయగా, హైకోర్టు దాన్ని కొట్టేసిందని గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడమే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదనడానికి నిదర్శనమని చెప్పారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. “సీబీఐ స్పందించలేదంటే ఆరోపణల్లో నిజం లేదని ఎలా అంటారు? సీబీఐ స్పందించకపోవడం వేరే అంశం. కానీ అదే ఈ కేసుకు బలం చేకూర్చే వాదన కాదు” అని జస్టిస్ ఎం.ఆర్ షా వ్యాఖ్యానించారు. అనంతరం వాదనలు కొనసాగిస్తూ రాజకీయ కక్షసాధింపు ధోరణితోనే, దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని నిర్ణయాల్లో తప్పులు వెతికాలన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే చేపల వేట కోసం వల విసిరినట్టుగా జీవోలు జారీ చేసిందని అన్నారు. ఒకవేళ ఏ పథకంలోనైనా తప్పులు జరిగాయని ప్రాథమికంగా తేలితే ఎలాంటి విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ గంపగుత్తగా అన్ని నిర్ణయాలపై సమీక్ష పేరుతో తప్పుల వేట, తద్వారా వేధింపులకు పాల్పడాలన్న దురుద్దేశం తప్ప మరేమీ లేదని సూత్రీకరించారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం “అసలు సమీక్షే జరపకూడదంటే ఎలా? అలా చేస్తే గత ప్రభుత్వం ఏం చేసినా నడుస్తుందా? వారు చేసే తప్పులకు పూర్తి రక్షణ కల్పించినట్టే కదా? అది ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్గించడమే కదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మాసనంలోని జస్టిస్ ఎంఎం సుందరేశ్ మాట్లాడుతూ.. “దర్యాప్తు ఇంకా మొదలుపెట్టక ముందే ప్రభుత్వానికి ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. ముందే వివక్షాపూరిత దర్యాప్తు అంటున్నారు. ఏదైనా విచారణ జరిగితేనే కదా తెలిసేది. రాజకీయ వైరం అనేది దర్యాప్తును నిలిపివేసేందుకు కారణం కాకూడదు” అన్నారు. ఎంక్వయిరీ (ప్రాథమిక విచారణ) జరిపితే తమకు అభ్యంతరం లేదని, అందులో అవకతవకలు బయటపడితే ఆ తర్వాత కేసులు నమోదు చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసినా తమకు అభ్యంతరం లేదని సిద్ధార్థ్ దవే అన్నారు. కానీ ప్రభుత్వం నేరుగా ఎఫ్.ఐ.ఆర్లు నమోదు చేసి వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. మళ్లీ జోక్యం చేసుకున్న ధర్మాసనం “క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) చట్టం ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎఫ్.ఐ.ఆర్ ఉండాలి.

అది లేకుండా అపరాథ పరిశోధన సాధ్యం కాదు” అని పేర్కొంది. అయినా ఏ తప్పూ జరగలేదని అనుకుంటే ఎందుకు భయపడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ జరిగితేనే అన్ని విషయాలు వెలుగులోకొస్తాయని, దురుద్దేశాలున్నా సరే అవి కూడా అప్పుడే బయటపడతాయని వ్యాఖ్యానించింది. “ఒకవేళ ప్రభుత్వం జీవోలు జారీ చేయకుండా అంతర్గత విచారణ జరిపి ఉంటే ఏం చేసేవారు? రెండో జీవో తదుపరి విచారణ కోసమే కదా. ‘సిట్’లో ఉన్నది ప్రభుత్వ ఉన్నాధికారులే తప్ప రాజకీయ నాయుకులు కాదు కదా. అధికారులకు కూడా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. తమకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పేందుకే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరినట్టుగా చెబుతోంది. దర్యాప్తు ఎవరు చేసినా సరే.. మా ప్రయత్నం అంతా ప్రజా ప్రయోజనాల కోసమే” అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement