Friday, November 22, 2024

తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం కావాలే.. కేంద్రానికి మంత్రి నిరంజ‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు శాస్త్రీయంగా సహకరించేందుకు ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి ఆయిల్ పామ్ సహా మిర్చి పంటను నాశనం చేస్తున్న సరికొత్త తామర తెగులు గురించి ఆయనతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ ను గుర్తించి ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ రైతులకు అనేక ప్రోత్సాహకాలిస్తుందని, ఈ నేపథ్యంలో ఈ పంట ఉత్పత్తిని మరింత పెంచేందుకు అనువుగా తెలంగాణలో ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ ప్రాంతీయ కేంద్రాన్ని (Regional Center for Oil palm Research) ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలో ఇప్పటికే 150 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించామని కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మరోవైపు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్నాయని, అయితే ఆయిల్ పామ్ పండించే రైతులకు డ్రిప్ సిస్టం మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టిందని, వాటిని సడలించాలని సింగిరెడ్డి కోరారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు అంశాలపైన కేంద్ర మంత్రికి నివేదిక ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మిర్చి పంటలకు, ఉద్యానవన పంటలకు నల్ల తామర తెగులు తగిలిందని, గత సంవత్సరమే ఈ నల్ల తామర (Black thrips) తెగులుపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రానికి శాస్త్రవేత్తలను పంపారని, శాస్త్రవేత్తల నివేదిక కూడా ఈ తెగులు మొదటి సారి మన దేశంలోకి వచ్చిందని గుర్తించారని అన్నారు. అదే విధంగా ఈ తెగులు నివారణకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ మందులు కూడా పని చేయవని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మిర్చి పండించే దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉందని, అందులోనూ అత్యధిక శాతం తెలంగాణలోనే పండిస్తారని గుర్తుచేశారు. గత పంట సీజన్‌లోనే నల్ల తామరతో పాటు ఇతర తెగుళ్లు సోకడంతో వరంగల్, మహబూబా బాద్, హన్మకొండ, భూపాల పల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అధిక శాతం రైతులు తమ పంటలను నేలమట్టం చేయాల్సి వచ్చిందని తెలిపారు. మిర్చి సాగుకు పెట్టుబడి హెక్టారుకు రూ.2.5-3 లక్షలు అవసరమవుతుందని, కానీ తెలంగాణలో చాలా మంది మిర్చి రైతులు భూమిని లీజుకు తీసుకోవడం కోసం ఇప్పటికే అదనంగా రూ.20,000-25,000 చెల్లిస్తున్నారని మంత్రి సింగిరెడ్డి అన్నారు. ఈ తెగులు వల్ల ఆ పెట్టుబడి వ్యయం ఇంకా పెరుగుతుందని కేంద్ర మంత్రికి చెప్పినట్టు ఆయన వివరించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి కొత్త మందును తీసుకు రావడం కేంద్రం ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున రైతులకు వీలైనంత త్వరగా ఆ కొత్త మందును అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కోరామని, అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ ఒక నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి ఇప్పటికే పంపినట్టుగా చెప్పారన్నారు. అలాగే నివారణ చర్యలను కూడా వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్, మరికొందరు అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement