Tuesday, November 26, 2024

నెలకోసారి ఎన్నికలుంటే పెట్రో మంటలుండవ్‌.. ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సెటైర్లు

ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలు అదుపులో ఉంటాయని, ఇలా నెలకోసారి ఎన్నికలు ఉంటే ఎంతో బాగుంటుందని ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే సెటైర్లు వేశారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజెల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలతో ప్రతిపక్షాలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్‌సీపీతో పాటు వామపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాకౌట్‌ చేశాయి. ఈ సందర్భంగా సుప్రియా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇంధన ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుతం చర్యలు తీసుకుంటుందని, ఆ తరువాత మళ్లీ యథావిధిగా పెంచుతూనే ఉంటుందని మండిపడ్డారు.

కేవలం ఎన్నికలు మాత్రమే.. పెట్రోల్‌, డీజెల్‌, వంట గ్యాస్‌ ధరలకు కళ్లెం వేస్తున్నాయన్నారు. ప్రతి నెలా ఎన్నికలు నిర్వహిస్తే.. చమురు ధరలు అదుపులో ఉంటాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగున్నంత కాలం ధరలేవీ పెరగలేవని, ఫలితాలు విడుదలై.. ప్రభుతాలు ఏర్పడ్డ వెంటనే.. మళ్లీ ఇంధన ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తంతు ముగియగానే.. మళ్లీ చమురు ధరలు పెరుగుతాయని చాలా మంది ముందుగానే ఊహించారని, ప్రభుత్వ తీరును ముందుగానే నిరసించారన్నారు. నవంబర్‌ 4 నుంచి స్థిరంగా ఉన్న ఇంధన ధరలు మంగళవారం నుంచి పెంపు ప్రారంభమైంది. వంట గ్యాస్‌ ధర కూడా రూ.50 పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement