- ఢిల్లీలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
- పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాలు సంతోషంగా ఉన్నాయంటే అది మహానేత ఎన్టీఆర్ చలవేనని, వెయ్యేళ్లైనా ఆయనను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని హర్షం వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా శనివారం ఆయన టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణతో కలిసి పార్లమెంట్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి, టీడీపీ కార్యాలయంలోని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ కేసినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ జన్మించి 99 ఏళ్ళు అయిపోయిందా అన్నట్లు ఉందన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల మనసుల్లోనే కాక ప్రతి భారతీయుడి హృదయంలో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ జీవన శైలి ప్రపంచానికే ఆదర్శమని… ప్రజలు, సమాజం, వ్యవస్థ కోసం జీవించారని నాని చెప్పుకొచ్చారు. ప్రభుత్వోద్యోగం వచ్చినా వద్దనుకుని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సినీ రంగాన్ని ఎంచుకున్నారని అన్నారు. రాముడు, కృషుడు, సుయోధనుడు, ఇలా ఏ పాత్రకైనా ఎన్టీఆర్‌ను మించిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేరని హర్షం వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన చేసిన సేవలను ఎంపీ నాని గుర్తు చేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. సీఎంగా ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు ఎవరు చేయలేదని, ఆయన సంస్కరణలే నేటికీ అమలవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబునాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఎన్టీఆర్‌కు మరణం లేదన్న నాని, ఆయన ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..