మనుషుల్లో పెరుగుతున్న వేగం, పతనమవుతున్న నైతిక విలువలూ, ఆచారాలూ, సంప్రదాయాలూ, కట్టుబాట్ల గురించి కొంతమంది బాధపడుతుంటే.. మరికొంత మంది ఇవన్నీ యాక్సెప్టబుల్‌గానే తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. 30 ఏళ్ల క్రితం పుట్టిన వారైతే ఒకలా ఆలోచిస్తారు.. పదేళ్ల క్రితం పుట్టిన వారైతే మరోలా ఆలోచిస్తారు. సొసైటీలో చాలా మంది ఎదుర్కొంటున్న స్ట్రగుల్ ఇవ్వాళేం కొత్త కాదు. ఈరోజు హిందూమతం, హిందూ సంస్కృతి అని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఇంతే బలంగా ఇదే ఆంధ్రదేశంలో అశోకుడి కాలంలో బౌద్ధమతాన్ని అందరూ నమ్మేవారు. కానీ, అమరావతి, నాగార్జున సాగర్ వంటి చోట్ల మ్యూజియాలుగా మిగలడం తప్ప ఈరోజు ఇదే నేల మీద బౌద్ధాన్ని చూడలేకపోతున్నాం.
దీనికి కారణం.. ఒక్కటే ఇక్ష్యాకుల కాలం వరకూ రాజభోగాలు అనుభవించిన బౌద్ధం రోమ్‌తో వ్యాపార సంబంధాలు దెబ్బతినడంతోనూ, మరో పక్క ఇక్ష్యాకుల తర్వాతి పల్లవులు.. ఉత్తర భారతదేశం నుండి కొన్ని వర్గాలను పిలిపించి వారికి గ్రామాలను దానం చేసి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయమని అప్పజెప్పి.. బౌద్ధం స్థానంలో వైదిక మతాన్ని ప్రమోట్ చేయడంతో బౌద్ధం కన్పించకుండా పోయింది..
ఇది చాలామందికి బోర్ కొట్టే హిస్టరీ కాకపోవచ్చు.. కానీ, హిస్టరీ తెలుసుకోవడం వల్ల జీవితంపై ఓ క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఏ రాజూ, ఏ రాజ్యమూ, ఏ వంశమూ, ఏ మతమూ, ఏ సిద్ధాంతాలూ శాశ్వతం కాదు అనే విషయం అర్థమైన రోజు ఈ కులాల నీడనా, మతాల నీడనా, ప్రాంతాల నీడనా చలి కాచుకుంటూ బతకాలన్న ప్రజల్లోని సంకుచిత భావాలూ విశాలం అవుతాయి.
ఒక మనిషి పుట్టిన కాలమానం, పరిస్థితులను బట్టి వారి లైఫ్‌స్టైల్ ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు చాలామంది iPadని చూసి ఉండకపోవచ్చు. ఈరోజు కళ్లు తెరిచిన వెంటనే పసిపాప కళ్లెదుట iPadని చూడగలుగుతోంది. సమాజంలో స్థూలంగా వచ్చే మార్పులను ఎవరమైనా అంగీకరించక తప్పదు. సమాజం మన కోసం ఆగదు. మార్పుకి మౌనంగా తలొగ్గుతూనే మగధ రాజులూ, మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్యాకులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులూ, ఆ తర్వాత ముస్లిం యుగం మనం ఇప్పుడు తిరుగుతున్న నేల మీదనే అంతరించిపోయాయి..
ఏది మంచో, ఏది చెడో ఎవరి డెఫినేషన్లు వారికున్నాయి. చరిత్రలో ఎవరికి తగ్గట్లు వారు లైఫ్‌ని కంఫర్టబుల్‌గా తీర్చిదిద్దుకున్నారు. రాజులు, రాజ శాసనాలు చేసుకున్నారు, శిక్షలు విధించారు, పని మాత్రమే చేయాల్సిన వారు చేసేశారు, అజమాయిషీ చేసేవారు పెత్తనం చలాయించారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏం లేదు. సొసైటీలో అదే స్థాయీ బేధాలూ! ప్రభుత్వాలూ, రాజకీయ నాయకులూ, ఉద్యోగులూ, కంపెనీ CEOలూ, ప్రాజెక్ట్ లీడర్లు, టీమ్ లీడ్‌లూ, కాంట్రాక్ట్ వర్కర్లూ… ఇలా ఎవరి తగ్గ లైఫ్ వారికి ఉంది.. ఎవరి నియమాలు వారికున్నాయి.. ఎవరెలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే శిక్షలూ మనం డిఫైన్ చేసేసుకున్నాం.
ఇక.. సో సిస్టమ్ అనేది ఎప్పుడూ ఏదో ఒక మూసలో సాగిపోతూనే ఉంటూ వచ్చింది. వ్యవస్థ పెను మార్పులకు లోనైన రోజున మనుషుల మధ్య హార్మోనీ దెబ్బతిని ఒకర్నొకరు చంపుకోవడమో, చావడమో చేసి పారేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇదంతా ఇంత స్థూలంగా ఆలోచిస్తున్నప్పుడు నాకైతే ఒక్కటే అన్పిస్తుంది. మన సగం జీవితం రేపు మన ప్రమేయం లేకుండా మారిపోయే సమాజాన్ని point out చేయడం మీదనే, సరిచేయజూడడంతోనే ముగిసిపోతోంది అని!
చరిత్రలో మనలాగే చాలామంది సమాజాన్నీ, వ్యవస్థల్నీ సరిచేయాలని చూశారు. కొందరు తిరుగుబాట్లు, విప్లవాలూ, యుద్ధాలూ చేశారు. కొందరి పేర్లు మనం ఇప్పుడు కాకతీయ మెస్, శాతవాహనా కాలేజ్ వంటి పేర్లతో ఫ్యాన్సీగా వాడి పారేస్తూ కూడా ఉన్నాం. కానీ, అన్నీ గతించిపోయేవే. అలాంటప్పుడు మనిషి తన వ్యక్తిగత ఔన్నత్యం గురించి ఆలోచించడంపై శ్రద్ధ పెట్టడం కరెక్ట్ కదా? వ్యక్తి ఎదిగితే.. సమాజం ఆటోమేటిక్‌గా ఎదుగుతుంది.
సమాజంలో కచ్చితంగా మార్పు వస్తుంది. వ్యక్తి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ప్రొడక్టివ్‌గా ఉండాలి.. అప్పుడే కదా క్వాలిటీ లైఫ్ దక్కేది. తద్వారా అలాంటి వ్యక్తుల సమూహంతో గొప్ప సమాజం సాధ్యపడదా? ఈ basic factని ఎందుకు మిస్ అవుతున్నాం అంటూ రాసుకొచ్చారు టెక్నికల్ గురు నల్లమోతు శ్రీధర్.