జీరో కొవిడ్ పాలసీ చైనా ప్రభుత్వానికి గండంగా పరిణమించింది. పౌరుల నుంచి ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నిరసన జ్వాలలు జిన్‌పింగ్ సర్కార్‌కు సంక్లిష్టంగా మారింది. దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ఆంక్షల్ని కొంతమేర సడలించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, పూర్తిస్థాయి ఆంక్షల్ని ఎత్తివేసేందుకు ధైర్యం చేయలేక పోతున్నది. ఉన్నఫలాన ఆంక్షల్ని తీసేస్తే, దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మరణాలు సంభవిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తుండటమే ఇందుకు కారణం.
ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌రేటు తక్కువగా ఉండటం వంటివి అందుకు మరికొన్ని కారణాలుగా పేర్కొంటున్నారు. హాంకాంగ్ తరహాలో పూర్తిగా ఆంక్షల్ని తొలగిస్తే, దాదాపు 20 లక్షల మంది మృత్యువాత పడతారని గ్వాంగ్జీ ప్రాంతంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటంగ్ అంచనా వేశారు. అదే సమయంలో కొవిడ్ కేసులు 23కోట్లకు చేరతాయని చెప్పారు. గత నెలలో షాంఘైజర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ విషయం తెలిపారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకుండా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చకుండా జీరో కొవిడ్ పాలసీ నుంచి చైనా బయటకు వచ్చేస్తే, దాదాపు 15 లక్షల మరణాలు సంభవించొచ్చని మే నెలలో విడుదలైన మరొక నివేదిక హెచ్చరించింది. బ్రిటీష్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ కంపెనీ ఎయిర్‌ఫినిటీ కూడా ఇదేవిధమైన అంచనాలు విడుదల చేసింది.