బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. దళితబంధు ద్వారా దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మోదీ మిత్రుడనే కారణంగా అదానీకి ఏడు విమానాశ్రయాలు అమ్మారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, ఉద్యోగులను ఆగమాగం చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారతదేశం పేదవారుండే దేశమని.. ప్రభుత్వం బడులు, బస్సులు నడిపితేనే పేదవాళ్లను ప్రైవేటు వాళ్లు దోపిడీ చేయకుండా అడ్డుకోవచ్చని అన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా, పేదలకు వైద్యం అందించాలని వరంగల్‌లో జైలు తీసీసి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ కడుతోందన్నారు.
ప్రభుత్వం ఎప్పుడూ కన్నతండ్రి లాగ ప్రజలను కళ్లలో పెట్టుకుని చూసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా, పేదల అవసరాలను గమనించిన సీఎం కేసీఆర్.. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఆర్టీసీని కాపాడుతున్నారని చెప్పారు. అలాగే పేదవారి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఆటో రిక్షాలకు పన్నులు రద్దు చేశాం. 25 వేల విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. సింగరేణితో నాకు దగ్గరి అనుబంధం ఉంది. సింగరేణి కార్మికులకు గత 75 సంవత్సరాలలో జరగని డెవలప్‌మెంట్, కేవలం 8 సంవత్సరాలలో చేసిన ఘనత కేసీఆర్‌దే. కార్మికుడి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు’’ అని తెలిపారు. కార్మికుల హక్కులు హరించే విధంగా 4 నల్ల చట్టాలు ఉన్నాయని, వీటిని వెనక్కి తీసుకునేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులందరి హక్కులు కాపాడుకున్న రోజే, కార్మికుల శ్రమకు గౌరవం ఇచ్చిన రోజే భారతదేశం ముందుకెళ్తుందన్నారు. 1919లో కార్మికులకు సంబంధించిన ఒక సంఘం పుట్టిందని, అనంతరం అనేక సంఘాలు ఏర్పడ్డాయని వివరించిన కవిత.. సంఘాలు ఉన్నాయ్ కాబట్టే కార్మికులకు హక్కులు లభిస్తున్నాయని చెప్పారు.