మరో మూడురోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్ట్ ఫిబ్రవరి 9న జరగనుంది. రెండు ప్రపంచ స్థాయి జట్ల మధ్య పోరు ఎంతో ఆసక్తికరంగా ఉండనుంది. గతంలో జరిగిన 2014, 2017, 2022 సిరీస్‌లలో భారత్ , ఆసిస్‌ను చిత్తు చేసింది. అయితే ఈ సారి టీమిండియాకు కీలకమైన రిషబ్ పంత్ అందుబాటులో లేడు. స్టార్ పేసర్ బుమ్రా కూడా మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో భారత్ వీళ్లిద్దరూ లేకుండానే బరిలో దిగనుంది. అయితే సిరాజ్, షమీ, ఉమేశ్ యాదవ్ , ఉనాద్కత్ రూపంలో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
దిగ్గజాలు రాణిస్తే
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, పూజారా బ్యాటింగ్‌లో రాణిస్తే ఇక భారత్‌కు తిరుగుండదు. ఈ మధ్యే స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌పై టీ 20 , వన్డే సిరీస్ గెలిచిన భారత్ పూర్తి కాన్ఫిడెన్స్‌గా ఉంది. భారత ఆటగాళ్లు అదే జోష్ కొనసాగిస్తే టెస్ట్ సిరీస్ విజయం ఖాయం.
అశ్విన్ కచ్చితంగా ఇబ్బంది పెడతాడు
ఆస్ట్రేలియాపై ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను రవిచంద్రన్ అశ్విన్ కచ్చితంగా ఇబ్బంది పెడతాడని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. గత రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అతను తెలిపాడు. గత రికార్డులు చూడండి. అశ్విన్ సాధించిన దాదాపు 50 శాతం వికెట్లు ఎడమ చేతి వాటం బ్యాటర్లవే అని ఇర్ఫాన్ వెల్లడించాడు. ఆసిస్‌పై ఈ స్పిన్నర్‌కు మంచి రికార్డు ఉంది. 18 టెస్టుల్లో 89 వికెట్లు తీశాడు. దాంతో ఈ సారి కూడా అతను చెలరేగితే పర్యాటక జట్టుకు కష్టకాలమే.
కానీ స్వదేశంలో బాక్సింగ్ డే టెస్ట్‌లో వార్నర్ వీర విహారం చేశాడు. వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. అంతే కాదు స్టీవ్ స్మిత్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసిస్ టాపార్డర్‌ను అశ్విన్ ఎలా దెబ్బకొడతాడనేది చూడాలి.
టీమిండియాకు గాయాల బెడద
టీమిండియాకు గాయాలు వేధిస్తున్నాయి. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. పేసర్ బుమ్రా కూడా తొలి రెండు టెస్టులకు అందు బాటులో లేడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా, భారత పర్యటనలో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ముందు జరుగుతున్న కీలక సిరీస్ ఇది. భారత్ (డబ్ల్యూటీసీ ఫైనల్) ముందు జరుగుతున్న కీలకమైన సిరీస్ ఇది. భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం ఈ సిరీస్ చాలా ముఖ్యం. దాంతో రెండు ప్రపంచ స్థాయి జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా ఉండనుంది.
ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ఉందనగా పర్యాటక ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ గాయపడ్డాడు. ఎడమ కాలికి అయిన గాయం నుంచి తానింకా కోలుకోలేదని అతను తెలిపాడు. మొదటి టెస్ట్ ఆడతానో లేనో చెప్పలేను. కోలుకునేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. గురువారం ప్రారంభం కానున్న నాగ్‌పూర్ టెస్టులో అంతా సాఫీగా జరుగుతుందని అనుకుంటున్నా’ అని హేజిల్‌వుడ్ అన్నాడు. ఇప్పటికే స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతను కూడా తొలి టెస్టులో ఆడేది అనుమానమే. దాంతో ఈ ముగ్గురి గైర్హాజరీలో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది.