భౌగోళిక ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాతావరణ మార్పుల తాలూకు అనేక విపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నాసా తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం పేర్కొంది. 20వ శతాబ్దపు మధ్య కాలంతో పోల్చినప్పుడు ప్రపంచ జనాభాలో పాతిక శాతం ప్రజలు ప్రతి సంవత్సరం అదనంగా ఒక మాసం రోజులపాటు తీవ్రమైన వేడిమి ఎదుర్కొంటారని సదరు అధ్యయనం తెలిపింది.
ప్రపంచంలోఅత్యధిక ప్రాంతాలు తీవ్రమైన వేడి తాలూకు ఒత్తిడికి గురవుతాయి. మరీ ముఖ్యంగా భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే దేశాలు మరింత ఇక్కట్ల పాలవుతాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇదే విషయమై అధ్యయనవేత్తల్లో ఒకరైన బే ఏరియా ఎన్విరాన్‌మెంటర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త రామకృష్ణ నేమాని మాట్లాడుతూ ”పర్యావరణంలో భవిష్యత్తులో సంభవించే వాతావరణ మార్పులు కార్చిచ్చులు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, పంట వైఫల్యాలకు దారి తీస్తాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థలకు, సమూహాలకు గణనీయమైన నష్టం వాటిల్లుతుంది” అని తెలిపారు.