అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ విద్యా విధానం పేరిట రాష్ట్రంలో అమలుచేయనున్న రేషనలైజేషన్ ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని ఫోరం ఆఫ్ రిజిష్టర్ట్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫోర్టో) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఛైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం ఆందోళన వ్యక్తం చేశారు. హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇటీ-వల విడుదల చేసిన జీవో నంబర్117 ఉత్తర్వుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి, విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపు, సెక్షన్ల వారీగా వర్క్ లోడ్ వంటి అంశాలను పరిశీలిస్తే విద్యాభివృద్ధి కోసం కాకుండా, ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడం కోసం రూపొందించినట్లు గా ఉందన్నారు. బోధన పేరిట హిందీ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరి చేయించుకోవాలని చూస్తున్నారన్నారు.
ఈ ఉత్తర్వుల కారణంగా రాష్ట్రంలో ఎన్నో పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడి పోస్టులను కేటాయించలేదని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పలు ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎం పోస్టులను, పిఈటీ పోస్టులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను రద్దు చేసి హేతుబద్ధీకరణను సహేతుకంగా చేపట్టాలని డిమాండు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.