Friday, October 18, 2024

రాంనాథ్ కోవింద్‌కి రాష్ట్రపతి పదవి ఇస్తే, దళితుల స్థితిగతులు మారిపోయాయా?.. గిరిజనులపై మోదీకి చిత్తశుద్ధి లేదు: కేటీఆర్​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తాము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు తెలిపామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. సోమవారం యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు నామ నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లౌకిక విలువలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తారన్న నమ్మకంతో తాము యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించామని తెలిపారు. అంతేకాదు, ఆయన్ను హైదరాబాద్ కూడా రావాలని కోరినట్టుగా చెప్పారు. పార్లమెంట్, శాసనసభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మద్దతు తెలుపుతామని కోరినట్టుగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్షాల మీద దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా ప్రయోగిస్తోందని ఆరోపించారు. అందుకే బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి వెంట నిలిచామని అన్నారు. జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో సిన్హాకు ఓటు వేయడమే కాదు, అవకాశం ఉంటే ఇతర పార్టీలను కూడా ఓటు వేయాల్సిందిగా కోరతామన్నారు.

తాము యశ్వంత్ సిన్హాకు మద్ధతివ్వగానే గిరిజన-ఆదివాసీలకు వ్యతిరేకమా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. భీష్ముడు చాలా మంచివాడని, కానీ కౌరవుల వైపు ఉన్నందుకు ఓటమి తప్పలేదని గుర్తుచేశారు. అలాగే ద్రౌపది ముర్ము మంచి వ్యక్తే కావొచ్చని, కానీ ఆమె ఎన్డీయే అభ్యర్థిగా ఉన్నందున తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఒడిశాలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఆందోళనలో 13మంది గిరిజనులను పోలీసులు కాల్చి చంపినప్పుడు ఆమె రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, కానీ ఆ ఘటనను ఆమె కనీసం ఖండించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. గిరిజనుల మీద బీజేపీకి నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే తాము పంపిన గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ చేసిన తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలపాలని, కానీ ఇంతవరకు ఆ పని చేయలేదని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గిరిజన యూనివర్సిటీ సంగతేంటో తేల్చాలన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే తెలంగాణలోని 7 గిరిజన మండలాలను ఏకపక్షంగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, నిజానికి కలిపారు అనడం కంటే ముంచేశారు అనడం సబబని కేటీఆర్ అన్నారు. గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే ఈ 7 మండలాలు వెంటనే తిరిగివ్వడంతో పాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని, గిరిజనులకు పెంచిన రిజర్వేషన్లను ఆమోదించాలని డిమాండ్ చేశారు.

తాము యశ్వంత్ సిన్హాకు మద్ధతిచ్చినంత మాత్రాన ప్రతిపక్ష కూటమిలో ఉన్నట్టు కాదని ఆయన వివరణ ఇచ్చారు. కేవలం ఒక సంతకం చేసినంత మాత్రాన కూటమిలో ఉన్నట్టు కాదని, యశ్వంత్ సిన్హా విషయంలో మమత బెనర్జీ, శరద్ పవార్ కోరినందుకే మద్ధతిస్తున్నామని తెలిపారు. ఒకవేళ తాము సొంతగా అభ్యర్థిని బరిలో దింపితే పరోక్షంగా ఎన్డీయేకు సహకరిస్తున్నారని విమర్శిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రారంభించిన “సాలు దొర – సెలవు దొర” ప్రచారాన్ని రాజకీయ భావదారిద్ర్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫోటో పెట్టకపోతే వాళ్ళను చూసే మొఖం లేదని ఎద్దేవా చేశారు. వారికంటే చిల్లరగా ప్రవర్తించాలంటే తాము కూడా ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయవచ్చని, చెప్పుల దండలు వేయవచ్చని, కానీ ఆ చిల్లర పనులు తాము చేయమని వెల్లడించారు.

గుజరాత్ రాష్ట్రానికి మూడు సార్లు మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఇప్పటికీ ఆ రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు ఉన్నాయంటే ఆయన పరిపాలన ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు. ద్రౌపది ముర్ము స్వగ్రామంలోనే ఇప్పటి వరకు విద్యుత్తు సదుపాయం లేదని, ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు విద్యుత్తు లైన్లు సమకూర్చుతున్నారని తెలిపారు. బీజేపీ చేసేవన్నీ జుమ్లా వ్యవహారాలేనని మండిపడ్డారు. అయితే జుమ్లా, లేదంటే హమ్లా అన్న చందంగా బీజేపీ అధినేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర పరిణామాల గురించి మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్ ని ఇలాగే గద్దె దించితే, మళ్లీ తిరుగులేని మెజారిటీతో గెలిచారని, ఈ పరిస్థితి బీజేపీకి కూడా తలెత్తుతుందని కేటీఆర్ అన్నారు.

ఐదేళ్ల క్రితం రామ్ నాథ్ కోవింద్ దళితుడు అని చెప్పి రాష్ట్రపతి ఎన్నికల ముందుకొచ్చారని, ఈ ఐదేళ్లలో దళితులకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, గ్యాస్ ధరలు ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌కు వచ్చేముందు మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా… ఈ దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా… అన్న విషయంపై కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తనకున్న సమాచారం ప్రకారం దేశంలో తెలంగాణ 4వ ఆర్ధిక శక్తిగా ఉందని, ఆ మేరకు దేశ సంపదలో భాగస్వామిగా ఉందని తెలిపారు. తెలంగాణ సొమ్మును గుజరాత్, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. తాము ఇచ్చిన డబ్బులు కంటే తెలంగాణకు ఎక్కువ నిధులిచ్చారని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దేశానికి అంత మేర ఆదాయం సమకూర్చడాన్ని తాము గర్వాంగా భావిస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇచ్చి గొప్పలు చెప్పుకునే దౌర్భగ్య స్థితిలో ఉందని మండిపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం తాము కట్టామని, కేంద్రం కనీసం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టునైనా పూర్తిచేసారా అని నిలదీశారు.

- Advertisement -

ఏ రాష్ట్రంలో మెజారిటీ లేకపోయినా.. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రకరకాల వ్యవస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. అప్పులు చేసి దేశాన్ని దివాళా తీసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా అంటే విద్వేషాలు రెచ్చగొట్టడం, విషం చిమ్మడం చేస్తున్నారని, విషయం మాత్రం లేదని కేటీఆర్ అన్నారు. శ్రీలంకలో అక్కడి పాలకులను ఒత్తిడి చేసి ఆదానీ గ్రూపునకు పవర్ ప్రాజెక్ట్ ఇప్పించిన విషయం అంతర్జాతీయంగా రచ్చ జరుగుతోందని, దానికి సమాధానం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయస్థాయిలో ఎప్పుడు విస్తరిస్తారన్న ప్రశ్నకు తినబోతూ రుచి అడగడం దేనికని బదులిచ్చారు. సమయం వచ్చినప్పడు పార్టీని జాతీయ స్థాయికి విస్తరిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement