కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ సమీపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. గాంధీల కుటుంబం నుంచి హడావుడి కనిపించడం లేదు. ఎన్నికల వారంలో కూడా కాంగ్రెస్ తదుపరి చీఫ్ ఎవరనే ప్రతిష్ఠంభనలో పురోగతి కనిపించడం లేదు. రాహుల్ గాంధీని నాయకత్వ పాత్రకు అంగీకరించేలా కాంగ్రెస్ నేతలు, శ్రేణులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల పరాజయం తర్వాత పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఏఐసీసీ సభ్యుల విజ్ఞప్తులను తిరస్కరించిన రాహుల్, తన నిర్ణయం పట్ల అదే వైఖరితో ఉన్నారు. సోనియా గాంధీ కూడా తన ఆరోగ్యం దృష్ట్యా, తిరిగి అధ్యక్షురాలిగా కొనసాగలేనని ఇప్పటికే తేల్చిచెప్పారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించలేకపోవడంతో ప్రియాంక గాంధీ వాద్రా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆ పార్టీకి తదుపరి సారధి ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, 137 ఏళ్ల నాటి కాంగ్రెస్ పార్టీ నాయత్వం విషయంలో ఎక్కువ మంది నేతలు గాంధీ కుటుంబీకులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తదుపరి సారథ్య బాధ్యతలకు ప్రియాంక గాంధీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే, ఉత్తరప్రదేశ్ అసెంబ్లిd ఎన్నికల్లో ఆమె సారథ్యం ఘోరమైన వైఫల్యాలను ఇచ్చింది. ఈ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కలచివేస్తున్నాయి.
పట్టువీడని రాహుల్..
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ మధుసూదన్ మిస్త్రీ ఆగస్టు 10న ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 9,100 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆగస్టు 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఆగస్టు 28 అని పేర్కొన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ సెప్టెంబరునాటికి పూర్తవుతుందని తెలిపారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని రాహుల్ గాంధీకి సోనియా గాంధీ నచ్చజెప్తున్నారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం ఎదురైన తర్వాత తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారని సమాచారం. ధరల పెరుగుదలపై ఈ నెల ఐదున కాంగ్రెస్ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు కూడా రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన పట్టువీడటం లేదు. మరోవైపు ఆయన అత్యంత ముఖ్యమైన నిర్ణయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఏర్పాటులో కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. జమ్ము-కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీని పునర్నిర్మించే నిర్ణయానికి కూడా దూరంగా ఉన్నారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ చానల్ తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ శనివారం నాటికి కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ప్రియాంకవైపు చూపు..
దీంతో సీనియర్లు ఎంతో ఆశతో ప్రియాంక గాంధీ వాద్రా పేరును పరిశీలిస్తున్నారు. కానీ ఇటీవలి ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆమె నేతత్వంలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్న విషయం చాలా మంది నేతల మదిలో మెదులుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్ష పదవిపై రా#హుల్ గాంధీ ఆసక్తి చూపడం లేదన్నారు. కానీ తాము ఆయనకు అనేక విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు. ఆ పదవిని ఎలా భర్తీ చేయాలో ఆయన చెప్పాల’ఇ కాంగ్రెస్ సీనియర్ నేత భక్తచరణ్‌దాస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొన్నేళ్లుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుస ఎన్నికల పరాజయాలు, సీనియర్ల నిష్క్రమణ తో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకవేళ గాంధీయేతరులు పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వస్తే, ఈ రేసులో గాంధీ కుటుంబీకులకు విశ్వసనీయులు ఎవరన్నదానిపైనా చర్చ జరుగుతోంది. చివరిసారి 1998లో సీతారాం కేసరి కాంగ్రెస్ సారథిగా పనిచేసిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లిd అలాంటి సారథ్యమే అనివార్యమనే వాదన వినిపిస్తోంది. మోడీ చేస్తున్న వారసత్వ విమర్శలను తిప్పికొట్టాలంటే ఇదే సరైన మార్గమనే భావన తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది.