న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్టు రేషన్ డీలర్ల ఫెడరేషన్ హెచ్చరించింది. జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజుతో పాటు మరికొందరు న్యూఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ… బుధవారం ఢిల్లీలోని ముక్తధార ఆడిటోరియంలో జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ అధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు, డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పారు. కమిషన్ విధానం రాష్ట్రానికో విధంగా అమలు చేయడం వల్ల డీలర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ నేషన్-వన్ రేషన్ విధానంలాగే వన్ నేషన్ – వన్ కమిషన్ విధానంలో ప్రతి క్వింటాకు 250 నుంచి 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీలర్లకు రావాల్సిన ట్రాన్స్‌పోర్ట్, హ్యాండ్లింగ్ లాస్‌లను అమలు చేయాలని సుప్రంకోర్టు ఆశ్రయించాలని సమావేశంలో తీర్మానించినట్లు రాజు తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందని, జులై 4న మండల కేంద్రాల్లో నిరసన, జులై 11న జిల్లా కేంద్రాల్లో నిరసన, జులై 18న రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిరసనలు చేపట్టాలని తీర్మానించిందన్నారు. ఆగస్ట్ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్ల న్యూ ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు రాజు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.