న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘నవ్ సంకల్ప్ శిబిర్’ అనంతరం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమల్లో భాగంగా ఏఐసీసీ నాయకత్వం మొత్తం మూడు బృందాలు, కమిటీలను ఏర్పాటు చేసింది. రాజకీయ వ్యవహారాల కోసం ‘పొలిటికల్ అఫైర్స్ గ్రూపు’ను ఏర్పాటు చేయగా, ఇందులో సభ్యులుగా పార్టీ అసమ్మతి నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలకు కూడా చోటు కల్పించింది. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ లో అసమ్మతి స్వరాన్ని బలంగా వినిపిస్తూ అధినేత్రికి లేఖాస్త్రాలు సంధించిన మొత్తం 23 మంది పార్టీ నేతల బృందం (జీ-23)లో ఈ ఇద్దరూ కీలకం. వరుస పరాజయాలతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందని, పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు అవసరమని ఆనాడు జీ-23 నేతలు వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడ్డంపై ఏఐసీసీ అధినాయకత్వం ఈ గ్రూపు నేతలపై ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసి, తమ సుదీర్ఘ రాజకీయానుభవంతో ఎన్నో క్లిష్ట సమస్యలను పరిష్కరించిన ఈ ఇద్దరు నేతలను రాజకీయ వ్యవహారాల గ్రూపులో తీసుకోవడం ద్వారా పార్టీ సమతుల్యతను పాటించింది. అసమ్మతి స్వరమైనా పార్టీ బాగు కోసమే కాబట్టి, వారు చేసిన తప్పును అధినాయకత్వం క్షమించినట్టు ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతోంది. అదే సమయంలో బహిరంగ లేఖ ద్వారా లేవనెత్తిన అంశాలు, సవాళ్లు, సమస్యలపై ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ గ్రూపులో సభ్యులుగా పరిష్కారమార్గాలను కనిపెట్టాల్సిన బాధ్యతను వారికి అప్పగించినట్టయింది.
మరోవైపు 2024 ఎన్నికల్లో గెలుపు కోసం అవసరమైన వ్యూహాలు రచించి, అమలు చేయడం కోసం ‘టాస్క్‌ఫోర్స్-2024’ ఏర్పాటు చేయగా, ఇందులో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (ఎస్కే)కు చోటు కల్పించింది. సునీల్ గతంలో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసి, ఇప్పుడు విడిగా తానొక రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో ఇప్పటికే పనిచేస్తుండగా, ఏఐసీసీ ఇప్పుడు జాతీయస్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టయింది. ఈ రెండింటితో పాటు ఉదయ్‌పూర్‌లో నిర్ణయించిన మేరకు తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడం కోసం ఒక గ్రూపును ఏఐసీసీ ఏర్పాటు చేసింది.
పొలిటికల్ అఫైర్స్ గ్రూపు..
రాహుల్ గాంధీ
మల్లికార్జున ఖర్గే
గులాం నబీ ఆజాద్
అంబికా సోని
దిగ్విజయ్ సింగ్
ఆనంద్ శర్మ
కే. వేణుగోపాల్
జితేంద్ర సింగ్
టాస్క్‌ఫోర్స్ -2024..
చిదంబరం
ముకుల్ వాస్నిక్
జైరాం రమేష్
కేసీ వేణుగోపాల్
అజయ్ మాకెన్
ప్రియాంక గాంధీ
రణదీప్ సింగ్ సుర్జేవాలా
సునీల్ కనుగోలు (ఎస్కే)
భారత్ జోడో ప్లానింగ్ గ్రూప్..
దిగ్విజయ్ సింగ్
సచిన్ పైలెట్
శశి థరూర్
రవనీత్ సింగ్
కేజే జార్జ్
జ్యోతిమణి
ప్రద్యుత్
జీతు పట్వారీ
సలీం అహ్మద్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..