న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆర్ 5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, గత్యంతరం లేక అమరావతి రైతులు పిటిషన్ ఉపసంహరించుకున్నారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆయన ఏపీ ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ కాసా జగన్మోహన్ రెడ్డి, అడ్వకేట్ జానకిరామయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతాల్లో 56 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పమని, దీన్ని టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. అమరావతిలో పేదలకు స్థానం లేదని కోర్టుల ద్వారా అడ్డుపడే ప్రయత్నం చేశారని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జీవోపై స్టే ఇవ్వాలని అడిగారి ఆయన చెప్పుకొచ్చారు. పేదలకు భూమి ఇస్తే మీకెందుకు కడుపు మంట? మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని సుప్రీంకోర్టు అడిగిందన్నారు.
సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 5 శాతం ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇస్తోందని ఆయన వివరించారు. అనంతరం స్పెషల్ ప్లీడర్ కాసా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… చట్టం ప్రకారం పేదలకు అయిదు శాతం భూమి ఇవ్వాల్సిందేనన్నారు. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించిందని ఆరోపించారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 45 ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. మాస్టర్ ప్లాన్ సవరణ చేసి ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారని, సీఆర్డీఏ చట్టం ప్రకారమే చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అమరావతి కేసులో సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుందని అడ్వకేట్ జానకిరామయ్య అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేసిన ప్రయత్నాలు నెరవేరలేదని సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవుతాయని ఆయన ఆకాంక్షించారు.