Tuesday, November 26, 2024

ఈవీలు పెరిగితే చైనాపై ఆధారపడాల్సిందే..

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా రాయితీలను అందిస్తోంది. ప్రధానంగా కాలుష్యా కారక ఉద్గారాలను తగ్గించడం, చమురు దిగుమతుల బిల్లు తగ్గించుకోడం కోసం విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రభుత్వం పోత్సహిస్తోంది. ప్రస్తుతం మన దేశం విద్యుత్‌ వాహనాల తయారీలో వినియోగించే అనేక విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా మన దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీని పెంచడం వల్ల చైనాపై ఆధారపడటం పెరుగుతుందని ఆర్ధిక మేథో సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) తెలిపింది. ముడి సరకులు, మినరల్‌ ప్రాసెసింగ్‌, బ్యాటరీ ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఈవీల తయారీ పెరగడంతో కొన్ని సమస్యలు వస్తాయని ఈ సంస్థ తెలిపింది. ప్రధానంగా బ్యాటరీ తయారీ, వినియోగం, రీ సైక్లింగ్‌ వల్ల కాలుష్యం పెరుగుతుందని తెలిపింది. ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి భారీగా లిథియం గనులను చైనా కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే లిథియంలో 60 శాతం చైనానే ప్రాసెస్‌ చేస్తోంది. లిథియంతో పాటు కోబాల్ట్‌ 65 శాతం, మాంగనీస్‌ను 93 శాతం చైనా ప్రాసెస్‌ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 4 బ్యాటరీలు ఉత్పత్తి అయితే అందులో 3 చైనా నుంచే వస్తున్నాయి. లిథియం ఐయాన్‌ సెల్స్‌లో వినియోగించే 60 శాతం కేథోడ్‌లను, 80 శాతం యానోడ్స్‌ను చైనా కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీని వల్ల భారత్‌లో విద్యుత్‌ వాహనాల తయారీ పెరిగితే చైనాపై ఆధారపడటం పెరుగుతుందని గ్లోబల్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ పేర్కొంది.

విద్యుత్‌ వాహనాల వల్ల ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారులు, పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలపై పడే ప్రభావాన్ని కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది. విద్యుత్‌ వాహన ధరలు అధికంగా ఉండడం, దూర ప్రయాణాలకు ఈవీల వినియోగం, భిన్న వాతావరణ పరిస్థితుల్లో పనితీరు, విద్యుత్‌కు డిమాండ్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో వినియోగించలేకపోవడం, కాలుష్యం తగ్గించకపోవడం, ఆటోమొబైల్‌ విడి భాగాల పరిశ్రమలపై పడే ప్రభావం, లిథియం అందుబాటు వంటి అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించింది. ఈవీల వల్ల దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలపై పడే ప్రభావం, కాలుష్యం, దిగుమతులు, ఆర్ధికవృద్ధి వంటి అంశాలను చర్చించాల్సిన అవసరం ఉందని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకులు అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

- Advertisement -

ఈవీ బ్యాటరీల్లో వాడే వాటి మూలంగా కాలుష్యం పెరుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. లిథియం కారు బ్యాటరీని తీసుకుంటే ఇందులో 12 కేజీల లిథియం, 15 కేజీల కోబాల్ట్‌, 30 కేజీల నికెల్‌, 44 కేజీల కాపర్‌, 50 కేజీల గ్రాఫైట్‌ను ఉపయోగిస్తారని తెలిపింది. వీటితో పాటు 200 కేజీల వరకు స్లీట్‌ అల్యూమినియం, ప్లాస్టిక్‌ పదార్ధాలను వినియోగిస్తారు. వీటిని వెలికి తీయడం, రవాణా చేయడం, ప్రాసెసింగ్‌ చేయడం వల్ల గాలి, నీటి కాలుష్యం పెరుగుతుందని జీటీఆర్‌ఐ తన నివేదికలో తెలిపింది. సాధారణంగా బ్యాటరీ జీవిత కాలం ఆరు సంవత్సరాలుగా ఉంటుంది. ఈ తరువాత దీన్ని రీసైకిల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనూ ఉద్గారాలు వెలువడతాయని తెలిపింది. ఈవీలను ప్రమోట్‌ చేసే కంపెనీలు వీటి గురించి మాట్లాడటంలేదని తెలిపింది.

విద్యుత్‌ వాహన వినియోగం వల్ల బ్యాటరీ ఛార్జింగ్‌ చేయడానికి బొగ్గు ఆధారిత విద్యుత్‌ను ఉపయోగిస్తారని పేర్కొంది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 60 శాతం శిలాజ ఇంధనాల నుంచే వస్తుందని పేర్కొంది. విద్యుత్‌ వాహనాల విడి భాగాల తయారీలో ఉన్న సంఘటిత, అసంఘటిత తయారీ సంస్థల మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. గ్యారేజీలు, షాపులు సైతం మూతపడతాయని తెలిపింది. ఒక్కో విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఒక్కో ఛార్జింగ్‌ పోర్ట్‌ టెక్నాలజీని వాడుతున్నాయని, ప్రామాణికత పాటించడంలేదని తెలిపింది. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement