Tuesday, November 26, 2024

అందరికీ ఉపాధి, ఇల్లు, భూమి ఇవ్వాలే.. సర్కార్ స్పందించకుంటే సమ్మే ఖాయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ ప్రజలందరికీ ఉపాధి, ఇల్లు, భూమి, ఆహారం, విద్యా, వైద్యం, సమానత్వం కోసం ఐదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ కన్వెన్షన్ పిలుపునిచ్చింది. వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తున్న సంఘాలు, వ్యక్తులను సమీకరించాలని తీర్మానించింది. వ్యవసాయ కార్మికుల అఖిల భారత కన్వెన్షన్ సోమవారం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో సమావేశమైంది. ఈ కన్వెన్షన్‌ను రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పీఎఆర్ఐ వ్యవస్థాపకులు పాలగుమ్మి సాయినాథ్ ప్రారంభించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ కార్యచరణ ప్రణాళికను ప్రవేశపెట్టగా, జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానంతో పాటు ఆయా రాష్ట్రాల్లోని సమస్యలపై అన్ని రాష్ట్రాలకు చెందిన 118 మందికి పైగా ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. జూన్-జులై నెలల్లో రాష్ట్రాల్లోనూ, జిల్లాల్లోనూ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సదస్సులు నిర్వహించాలని కన్వెన్షన్ నిర్ణయించింది. జూలై 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రచార ఉద్యమం చేపట్టాలని కన్వెన్షన్ నిర్ణయించింది. ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 500 గ్రామీణ జిల్లాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రామీణ సమ్మెకు దిగుతామని కన్వెన్షన్ నాయకులుహెచ్చరించారు.

అసమానతలు పెరిగాయి: పి.సాయినాథ్

దేశంలో 1920 నాటి తీవ్రమైన అసమానతలు పెరిగాయని సాయినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన అసమానతలకు అధికంగా ప్రభావానికి గురవుతున్న వారు వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, మహిళలని అన్నారు. 1991లో దేశంలో ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినప్పుడు, దేశంలో ఒక్క డాలర్ బిలియనీర్ కూడా లేడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫోర్బ్స్ నివేదిక ప్రకారం దేశంలో 166 డాలర్ల బిలియనీర్లు ఉన్నారని సాయినాథ్ తెలిపారు. కోవిడ్‌-19 కాలంలో కార్పొరేట్‌ సంస్థలు భారీ లాభాలు ఆర్జించేందుకు ప్రభుత్వ విధానాలు దోహదపడ్డాయని ఆరోపించారు. వ్యవసాయ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన వాపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement