స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఉదయాన్నే 7 గంటలకే వెళ్లగలిగినప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు 9 గంటలకు విధులకు హాజరవడం ఏమంత కష్టమని, తప్పనిసరిగా ఆ సమయానికి విధులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు జస్టిస్, తదుపరి సీజేఐ యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా శుక్రవారంనాడు గంట ముందుగానే విచారణ చేపట్టి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 10.30 గంటలకు సుప్రీకోర్టులో విధులు ప్రారంభిస్తారు. కానీ శుక్రవారంనాడు 9.30లకే కోర్టు నెంబర్ 2లో జస్టిస్ లలిత్ సారథ్యంలోని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు దులియాలలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. కాగా జస్టిస్ లలిత్ చొరవపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం 9.30 గంటలు సరైన సమయమని రోహత్గి వ్యాఖ్యానించగా 9 గంటలకో వాదనలు వినడానికి మేం సిద్ధంగా ఉంటామని జస్టిస్ లలిత్ బదులిచ్చారు.
సుదీర్ఘ విచారణలు అవసరం లేని కేసులున్నప్పుడు ఉదయం 9 గంటలకే విధులు ప్రారంభించాలని, 11.30కు అరగంట విరామం తీసుకుని మళ్లి పని ప్రారంభించి మధ్యాహ్నం 2 కల్లా ముగించాలని సూచించారు. ఇందువల్ల రెండో పూట పనిచేయడానికి మరింత సమయం లభిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుండగా 1-2 గంటల మధ్య భోజన విరామం పాటిస్తున్నారు. ప్రస్తుత సీజేఐ ఎన్.వి.రమణ పదవీ విరమణ పొందిన తరువాత ఆ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే.