Friday, November 1, 2024

TG | కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే క్రిమినల్‌ చర్యలు !

రాష్ట్రంలో నవంబర్‌ 6 నుంచి కుల గణన చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్‌ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కులగణన బృహత్తర కార్యక్రమమన్న నిరంజన్‌.. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్‌లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిరంజన్‌ మాట్లాడారు. జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం.. అది నిరూపించుకునేందుకు ఈ సర్వే కీలకమని అన్నారు.

ఈ గణన ద్వారా బీసీలతో పాటు అన్ని కులాల జనాభా లెక్కలు, వారి ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తమ దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉందన్న నిరంజన్‌.. న్యాయస్థానం సూచించినట్లే ముందుకు వెళ్తామని చెప్పారు.

న్యాయ నిపుణుల సలహా మేరకు నవంబర్‌ 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో చాలా రకాల విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. కొన్ని కులాల పేర్లు ఎప్పుడూ వినినవి కూడా తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు.

కులగణన జరుగుతున్న సమయంలో కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలని నిరంజన్‌ పిలుపునిచ్చారు. సర్వే సక్రమంగా జరిగేలా చూడాలని అన్నారు. 80 వేల నుంచి 90 వేల మంది ఎన్యుమరేటర్లు జనగణనలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

- Advertisement -

ఎవరూ దీన్ని రాజకీయం చేయొద్దని, అపోహలు ఆటంకాలు సృష్టించడం మంచిది కాదని సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలన్నారు. అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement