న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీకి మరోసారి అధికారం అప్పగిస్తే దేశం ముక్కలవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు అన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హిందూ రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా బీజేపీ నేతలు మైనారిటీల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా గల్ఫ్, ఇస్లామిక్ దేశాలు భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తున్నారని, ఉపాధి కోసం ఆ దేశాలకు వెళ్లిన భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను వెంటనే అరెస్టు చేసి ఉంటే దేశంలో హింస చెలరేగేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగిందని, రాంచీలో పోలీస్ ఫైరింగ్‌లో ఇద్దరు చనిపోయారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో జరిగిన హింసలో అనేక ఇళ్లు దగ్ధమయ్యాయని అన్నారు. మైనారిటీలను దేశంలో ఉండనీయదల్చుకోలేదా అంటూ ఆయన బీజేపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. దురుద్దేశంతోనే బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, సస్పెండ్ చేస్తే ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని, అప్పుడే దేశవ్యాప్తంగా చెలరేగిన హింస సద్దుమణుగుతుందని వీహెచ్ అన్నారు.
వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే…
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు సహా బీజేపీ ఇచ్చిన ఇచ్చిన అనేక హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయిందని, ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రతిపక్ష నేతలపై కేసులు, మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటూ వీహెచ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. చివరకు అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన సోనియా గాంధీని సైతం వదిలిపెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. కక్షసాధింపు కోసమే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.
మీతో ఉంటే పతివ్రతలు.. బయట ఉంటే వ్యభిచారులు..
అవినీతిపరులు బీజేపీలో చేరగానే వారి అవినీతి మాయమైపోతుందని వీహెచ్ ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ల విషయంలో ఏం జరిగిందో చూశామని, బీజేపీలో చేరగానే వారిపై ఉన్న కేసుల సంగతి మర్చిపోయారని విమర్శించారు. బీజేపీలో ఉండే పతివ్రతలు, వేరే పార్టీల్లో ఉంటే వ్యభిచారులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని హనుమంత రావు అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.