బిజ్నూర్(యూపీ): వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఓ అధికారి వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులు తమ విధుల్లో చేరే ముందు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేయడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు వెరిఫికేషన్ కోసం తమ దగ్గరకు వచ్చే యువతీ యువకులకు సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) దేవేంద్ర సింగ్ ఓ నిబంధన తీసుకొచ్చారు. డాక్యుమెంట్లతోపాటు వరకట్నానికి వ్యతిరేకంగా అంటూ అఫిడవిట్ సమర్పించాలని ఓ నిబంధన పెట్టారు.
ఇందుకు యువతీ యువకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వరకట్న దురాచారాన్ని రూపమాపడమే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నట్లు సింగ్ తెలిపారు. కట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరమని చట్టం ఉన్నప్పటికీ… సమాజంలో ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్‌డీఎం తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది డాక్యుమెంట్లు పరిశీలించానని, అందరూ వరకట్నానికి వ్యతిరేకమంటూ అఫిడవిట్లు సమర్పించారని ఎస్‌డీఎం దేవేంద్ర సింగ్ తెలిపారు.