Friday, November 15, 2024

బద్దకస్తులు ఆర్థిక వ్యవస్థకు భారం.. శారీరక శ్రమకు దూరమైతే నష్టమే

మా జీవితం మా ఇష్టం.. మా ఆరోగ్యం మా ఇష్టం.. అనుకుంటే కుదరదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ). కొందరి బద్దకం, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వ్యక్తిగతంగా వారికి మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజానికి భారీగా ఆర్థిక నష్టం కలుగజేస్తుందని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరిస్తోంది. ఇలా తమ ఆరోగ్యం పట్ల కొందరు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రపంచానికి 25 లక్షల కోట్లు ఖర్చవుతోందట. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యుహెచ్‌ఒ వివరించింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా రానున్న ఏడేళ్ల కాలంలో సుమారు 50 కోట్ల మంది దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల రాబోయే కొన్నేళ్లలో గుండె సంబంధిత, ఊబకాయం వంటి అనేక వ్యాధులు సోకుతాయని తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వాలు ఏటా రూ.2.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఫలితంగా 2030 నాటికి ఈ వ్యయం దాదాపు రూ.25 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

ప్రజల్లో శారీరక శ్రమ పెంచాలంటూ 2019లో గ్లోబల్‌ యాక్షన్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. అందులో సూచించిన మార్గదర్శకాలను ప్రపంచదేశాలు ఏమేరకు అమలు చేస్తున్నాయో తెలుసుకునేందుకు ఇటీవల 194 దేశాల్లో సర్వే నిర్వహించింది. ప్రజల్లో శారీరక శ్రమ లోపించినట్లు ఇందులో గుర్తించింది. ఈ ప్రభావం ప్రభుత్వాలపై రాబోయే కాలంలో ఆర్థికంగా భారంగా పరిణమించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. శారీరక శ్రమ కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా, వ్యక్తులను భౌతికంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, సమాజానికీ, ఆర్థికవ్యవస్థకు మేలని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ తెలిపారు.

50శాతం కంటే ఎక్కువ దేశాల్లో మాత్రమే జాతీయ స్థాయిలో ప్రజల భౌతిక కార్యకలాపాలకు సంబంధించిన విధానాలున్నాయి. ఇందులో 40శాతం మాత్రమే అమలవుతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో వయోజనుల వ్యాయామాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది.కానీ 75 శాతం మాత్రమే దాన్ని అమల్లో పెడుతున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై కేవలం 30 శాతం దేశాలే దృష్టిసారిస్తున్నాయి. రహదారికి పక్కన సైక్లింగ్‌, నడకకు సంబంధించిన ఏర్పాట్లను రవాణా వ్యవస్థలో భాగం చేయాలని సిఫార్సు చేయగా, కేవలం 40 శాతం దేశాలు మాత్రమే దీనిని అమలు చేస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement