Tuesday, November 26, 2024

ఐసీయూ బెడ్స్ ఫుల్

దేశంతోపాటు తెలంగాణలో రోజువారీ కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా… ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్) బెడ్లకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ హైదరాబాద్ నగరంలోని ప్రయివేటు/కార్పోరేటు ఆస్పత్రులకు ఐసీయూ బెడ్లు కావాలంటూ కనీసం 10 నుంచి 20ఫోన్లు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ప్రయివేటు ఆస్పత్రులకు ప్రతి రోజూ 50 నుంచి 100 మంది దాకా ఐసీయూ బెడ్ల కోసం రోజూ ఫోన్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది ఐసీయూ బెడ్లు కావాలంటుండగా… పెద్ద సంఖ్యలోనే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూ బెడ్ కావాలని పలువురు కోరుతున్నారు. కొవిడ్ సోకడంతో పరిస్థితి విషమించిన కొందరు డయాలసిస్ పేషెంట్లకు డయాలసిస్ మిషతో కూడిన ఐసీయూ బెడ్ అవసరం ఏర్పడుతోంది. కేర్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రాహుల్ మాట్లాడుతూ… వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల్లో 75శాతం మంది కోలుకుంటున్నారని చెప్పారు. అయితే వెంటిలేటర్పై ఒక్కో పేషెంట్ కు కనీసం 21 రోజుల దాకా చికిత్స అందించాల్సి వస్తుండడంతో వెంటిలేటర్తో కూడిన ఐసీయూ బెడ్లు త్వరగా ఖాళీ అవడం లేదని ఆయన వివరించారు. ఇంట్లో అయిదారు రోజుల చికిత్స పొందాక, చిన్న ప్రయివేటు ఆస్పత్రుల్లో నాలుగైదు రోజులు చికిత్స పొందాక… కొందరు కొవిడ్ రోగులు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ ఐసీయూ బెడ్ పై చికిత్సకావాలంటూ వస్తున్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొంది కోలుకున్నాక విధుల్లో చేరిన వారిలో చాలా మందిలో 10 నుంచి 15 రోజుల తర్వాత ఉన్నట్టుండి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు చెబుతున్నారు.

ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో బెడ్ల కోసం కొవిడ్ రోగులకు సాయం చేసే … వలంటీర్లు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఇటీవల వారం రోజులుగా ఆక్సిజన్ బెడ్లకు డిమాండ్ తగ్గినా… ఐసీయూ బెడ్లకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో మొత్తం శివేల ఐసీయూ బెడ్లు ఉండగా… అందులో అపోలో ఆస్పత్రిలో 180, కేర్ లో 120, యశోదా 40, ఏఐజీలో 400, కిమ్స్ లో 85, ఎమ్మెలో 65, మిగతా చిన్న, చితకా ప్రయివేటు ఆస్పత్రుల్లో కలిపి 20బెడ్ల దాకా కోవిడ్ రోగులకు అందుబాటులో ఉన్నాయి.ఇదిలా ఉంటే… వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మొత్తం 1677 ఐసీయూ బెడ్లలో 498 బెడ్లు ఖాళీ ఉన్నాయని, ప్రయివేటు ఆస్పత్రుల్లో 6677 ఐసీయూ బెడ్లు ఉండగా… 2592 బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నా… క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా
ఉంది. హైదరాబాద్ లోని ఏ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లినా ఐసీయూ బెడ్లు ఖాళీ లేవన్న సమాధానమే వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement