ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన నికర లాభం 34.2 శాతం పెరిగి, 8,311.85 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. నికర వడ్డీ రేట్ల పెరగడంతోనే నికర లాభంలో పెరుగుదల నమోదైందని బ్యాంక్ తెలిపింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే బ్యాంక్ నికర లాభం 10 శాతం పెరిగింది. పన్నులకు ముందు బ్యాంక్ లాభం 13,235 కోట్లుగా ఉంది.
బ్యాంక్ సంపాదించిన వడ్డీ, ఖర్చు చేసిన వడ్డీ మధ్య వ్యత్యాసం సంవత్సరానికి 34.6 శాతం పెరిగి, 16,464.98 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 4.65 శాతంగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 3.96 శాతం ఉంది. ఆర్బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్లను పెంచింది. రానున్న కాలంలో వడ్డీ మార్జిన్ బాగుంటుందని బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం అడ్వాన్స్‌లు డిసెంబర్ 31 నాటికి 19.7 శాతం పెరిగి 9.74 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో మొత్తం డిపాజిట్లు 10.3 శాతం పెరిగి 11.22 లక్షల కోట్లకు చేరాయి. టర్మ్ డిపాజిట్లు 10.4 శాతం పెరిగి 6.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్ నెట్ ఎన్‌పీఏలు కూడా తగ్గాయని తెలిపింది.