Saturday, November 23, 2024

వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. గృహ రుణాల చెల్లింపుల భారం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లు పెంచడంతో.. ఇప్పుడు బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. దేశంలోని దిగ్గజ బ్యాంకులు వరుసబెట్టి వడ్డీ రేట్ల పెంపుపై ప్రకటనలు చేస్తున్నాయి. ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్‌ దిగ్జజం ఐసీఐసీఐతో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లెండింగ్‌ రేట్లను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించాయి. దీంతో హోమ్‌ లోన్స్‌ వడ్డీ రేట్లు పెరగనున్నాయి. గృహ రుణాల చెల్లింపులు కూడా ఖరీదు కానున్నాయి. ఈ రుణాలు రెపో రేటుతో లింక్‌ అయి ఉంటాయి. రానున్న మరికొన్ని రోజులు మిగిలిన బ్యాంకులు సైతం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు రేట్లను పెంచుతాయని తెలుస్తున్నది.

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రానున్న కాలంలో వడ్డీ రేట్లను మరింత పెరుగుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా పెంపుతో సంకేతాలు ఇచ్చింది. ఆర్‌బీఐ పాలసీ రెపో రేటుతో లింకైన ఐసీఐసీఐ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌ రేటు మే 4 నుంచి వార్షికంగా 8.10 శాతంగా అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు ఈ రేటును ఆర్‌బీఐ రేటు పెంపునకు అనుగుణంగా 40 బేసిస్‌ పాయింట్లను మాత్రమే పెంచింది. మే 5 నుంచి రెపోతో లింకైన బరోడా లెండింగ్‌ రేటు రిటైల్‌ లోన్లపై 6.90 శాతం ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించింది. ఈ రేటును బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా 40 బేసిస్‌ పాయింట్ల మేర మాత్రమే పెంచింది. రానున్న రోజుల్లో మరికొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement