వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో పెద్ద షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో శ్రీలంక పాల్గొనే అవకాశం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు సొంత నిర్ణయాలను తీసుకోవడంలో.. స్వచ్ఛందంగా పని చేయడంలో ఐసీసీ నియమావళిని అతిక్రమించిందంటూ పేర్కొంది. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుల్లో ఆయా దేశాల జోక్యం ఉండకూడదు. గతంలో జింబాబ్వేపై కూడా ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ నిర్ణయంతో.. ద్వైపాక్షిక సిరీస్ లను ఆడే అవకాశం ఉంటుంది. అయితే, ఐసీసీ నిర్వహించే టి20, వన్డే, చాంపియన్స్ ట్రోఫీల్లో మాత్రం శ్రీలంకకు పాల్గొనే అవకాశం ఉండదు. మళ్లీ శ్రీలంక క్రికెట్ బోర్డు ఎప్పుడైతే స్వతంత్రగా వ్యవహరిస్తుందో అప్పుడు ఐసీసీ నిషేధాన్ని ఎత్తి వేస్తుంది.