ఐసీసీ నుంచి ఇటీవల క్రికెట్ ప్రసార హక్కులను కొనుగోలు చేసిన డిస్నీ స్టార్ జీ టీవీ సంస్థకు సబ్ లైసెన్సు ఇచ్చింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు జీకి చెందుతాయి. కాగా డిజిటల్ ప్రసార హక్కులు మాత్రం తనకే డిస్నీస్టార్ ఉంచుకుంది. హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రసారాలు చేయనుంది. భారత క్రీడా చరిత్రలో ఈ తరహా ప్రసార హక్కుల సబ్‌లైసెన్సింగ్ ఒప్పందం ఇదే ప్రథమం. ఈ ఒప్పందం 2024 వరకు అమలులో ఉంటుంది. ఈ ఒప్పందానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపిందని ఈ రెండు మీడియా సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే, దీనిని ఇంకా మేం ఆమోదించాల్సిన అంశంగా ఐసీసీ ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)ను ప్రారంభించిన నేపథ్యంలో 2007లో జీ సంస్థను బీసీసీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత అన్నిపక్షాలు రాజీ ఒప్పందానికి వచ్చాయి. ఆ తరువాతే ఐపీఎల్ ప్రసార హక్కుల విషయంలో జీ పోటీ పడింది. బీసీసీఐ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకముందు ఐసీసీ ప్రసార హక్కులను దక్కించుకున్న జీ స్పోర్ట్స్ రెండో అతిపెద్ద సంస్థగా పేరుపొందింది. ఐఎల్‌టీ (దుబాయ్ లీగ్) మ్యాచ్‌ల ప్రసార హక్కులను ఏకంగా పదేళ్లపాటు దక్కించుకుంది. డిస్నీస్టార్ – జీ యాజమాన్యం మధ్య తాజా ఒప్పందం కుదర్చడంలో బీసీసీఐ మాజీ సీఈఓ రాహుల్ ఝోరి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జీ ఎండీ పునీత్ గోయెంకా కూడా చొరవ తీసుకోవడంతో ఇది సాధ్యమైంది. మూడు దశాబ్దాలపాటు మీడియారంగంలో శత్రువులుగా తలపడ్డ ఈ రెండు సంస్థలు ఇప్పుడు ఏకమవడం విశేషం. ఐసీసీ ప్రసార హక్కులను కొనుగోలు చేసిన డిస్నీస్టార్‌పై 3 బిలియన్ డాలర్ల భారం పడింది. ఆ మొత్తం సమకూర్చుకోవడం తలకుమిం చిన భారంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో జీతో ఒప్పందం కుదరడంతో ఊపిరిపీల్చుకుంది. అయితే, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం విలువ ఎంతన్నది రహస్యంగా ఉంచారు. ఈ ఒప్పందంలో త్వరలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ కూడా భాగస్వామ్యం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీ-సోనీ విలీనం ప్రక్రియ జోరందుకుందని, త్వరలో అది కూడా పూర్తికానుందని చెబుతున్నారు.
జీ ప్రసార హక్కులు ఇవీ
చెబుతున్నారు. ఐసీసీ నిర్వహించే పురుషుల క్రికెట్‌కు సంబంధించిన మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసార హక్కులు జీకి లభించాయి. త్వరలో జరిగే ఐసీసీ మెన్స్ టీ20 (2024,2026), ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ (2025), ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ (2027), ఐసీసీ అండర్ -19 మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా జీకి దక్కాయి. దేశంలోని క్రీడారంగ వ్యాపారంలో తమ వ్యూహాత్మక, దార్శనిక విధానాలకు డిస్నీ స్టార్‌తో కుదిరిన తాజా ఒప్పందం అద్దం పడుతుందని జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఐపీఎల్ (2023-27) మ్యాచ్‌ల ప్రసార హక్కులతోపాటు, ఐసీసీ టోర్నమెంట్స్ (2024-27) డిజిటల్ ప్రసార హక్కులను తమకు ఉంచుకున్నామని డిస్నీ స్టార్ భారత మేనేజర్, ప్రెసిడెంట్ కె.మాధవన్ వెల్లడించారు. అయితే మహిళ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులపై ఇరు పక్షాలు ఎటువంటి ప్రకటనా చేయలేదు. బహుశా, ఆ రెండు మీడియా సంస్థలూ ఆ మ్యాచ్‌లను ప్రసారం చేసే అవకాశం ఉంది.