హైదరాబాద్,ఆంధ్రప్రభ : ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో సోమవారం భారీ ఊరట లభించింది. దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని ఆమెపై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈక్రమంలో ఈ పిటిషన్‌కు విచారణ అర్హతలేదని హైకోర్టు కొట్టివేసింది.
ఆలిండియా సర్వీసుల్లో (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్) వికలాంగుల కోటా అవసరమా అంటూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వికలాంగులపై స్మితా సబర్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.
అత్యున్నత పదవిలో ఉండి స్మితా సబర్వాల్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు, మేధావులు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. చివరకు స్మితా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో దివ్యాంగులపై చేసిన వాఖ్యాల విషయంలో స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట దక్కింది.