చండీగఢ్: జేపీలో చేరితో తనకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పిస్తామని, భారీఎత్తున నగదు ముట్టచెబుతామని ఆ పార్టీకి చెందిన నేతలు ఆఫర్ ఇచ్చారని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ ఆరోపించారు. వచ్చే ఏడాది పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీకి చెందిన సీనియర్ నేత తనతో మాట్లాడారని, తను ఏం కోరుకుంటున్నారో చెప్పమని, డబ్బా, పదవా.. ఏదైనా సరే ఇస్తామని, బీజేపీలో చేరాలని కోరారని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.పైగా ఆప్ కు పంజాబ్ లో ఒకే ఒక్క ఎంపీ మీరే అయినందున బీజేపీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల ఇబ్బందులేమీ ఎదురుకాబోవని, మా పార్టీలో చేరితే మీరు కోరుకున్న పోర్టుపోలియోతో కేంద్ర కేబినెట్లో స్థానం ఇస్తారని ఆయన ఆఫర్ చేసినట్లు మాన్ చెప్పుకొచ్చారు. గోవా,ప.బెంగాల్, మధ్య ప్రదేశ్ లలో మాదిరిగానే పంజాబ్ లోనూ ఆకర్ష్ రాజకీయాలకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.