న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లడానికి ముందు ఆమె ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావ్ థాక్రేతో భేటీ అయ్యి పొంగులేటి చేరికపై తన అభిప్రాయం వెల్లడించారు. రాహుల్ గాంధీతో భేటీకి వెళ్లడానికి ముందు పొంగులేటి, రేణుక చౌదరితో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ అరగంటసేపు చర్చించారు. అనంతరం రేణుక మీడియాతో మాట్లాడుతూ తాను పొంగులేటిని వ్యతిరేకించినట్టు ఎవరు చెప్పారు? నేను ఎక్కడైనా మాట్లాడానా? అని ప్రశ్నించారు. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనేది తాము అనుకుంటే సరిపోదని అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
తాను పార్లమెంటుకు పోటీ చేస్తానో, అసెంబ్లీకి పోటీ చేస్తానో ఎవరికి తెలుసు అన్నారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగవచ్చని ఆమె జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని రేణుక నొక్కి చెప్పారు. కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ పాకెట్ మనీ ఇస్తున్నారన్న బండి సంజయ్ ఎవరి దగ్గర పాకెట్ మనీ తీసుకుంటున్నారో తెలీదా అంటూ ఎద్దేవా చేశారు. కోవర్టులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్న ఆమె, రాజకీయ వ్యవస్థలో కోవర్టులు ఒక భాగమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోనూ కోవర్టులు ఉన్నారని, అయినా వారితో నష్టం లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకీ పెరుగుతోందని రేణుక చౌదరి తెలిపారు.