- ఐఏఎఫ్, ఆర్మీ అధికారులైన దంపతులు..
- వేర్వేరు చోట్ల ఆత్మహత్య
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్), ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్తతో పాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారిణి అయిన భార్య సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన 32ఏళ్ల దీన్ దయాళ్ దీప్, ఐఏఎఫ్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్ ఆగ్రాలోని మిలిటరీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నది. మిలిటరీకి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ క్వాటర్స్‌లో భార్యాభర్తలు నివసిస్తున్నారు.
నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి..
కాగా, అక్టోబర్ 14న సోమవారం రాత్రి సహోద్యోగులతో కలిసి డిన్నర్ చేసిన ఫ్లైట్ లెఫ్టినెంట్ దీన్ దయాళ్ దీప్ తన క్వాటర్స్‌కు వెళ్లి నిద్రించాడు. మరునాడు ఉదయం అతడు నిద్ర నుంచి లేవకపోవడంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అతడు సూసైడ్ చేసుకున్నట్లు గమనించి ఆగ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
విషయం తెలిసి తానూ..
మరో వైపు దీన్ దయాళ్ దీప్ భార్య అయిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్, తన తల్లి కౌశల్యకు వైద్య చికిత్స కోసం సోదరుడు సుమిత్‌తో కలిసి అక్టోబర్ 14న ఢిల్లీకి చేరుకున్నది. ఆర్మీ కంటోన్మెంట్ గెస్ట్ హౌస్‌లో వారు బస చేశారు. తల్లి, సోదరుడు ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లగా కంటోన్మెంట్ గెస్ట్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న రేణు తన్వర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, తన మృతదేహాలకు కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిలిటరీలో అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడటంపై ఢిల్లీ, ఆగ్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.