Saturday, November 23, 2024

Delhi | ఎన్టీఆర్ భార్యను నేను, ఆహ్వానం నాకెందుకు లేదు : పార్వతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు తాను భార్యనని.. తనకెందుకు ఆహ్వానం పంపలేదని లక్ష్మీ పార్వతి భారత రాష్ట్రపతిని ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విడివిడిగా రాసిన లేఖల్లో ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 నాణెం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య హోదాలో తనను ఆహ్వానించకపోవడంపై లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో తన పేరును చేర్చాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ తన భర్త అని, తన భర్త పేరుపైన నాణెం విడుదల చేస్తూ తనకు ఆహ్వానం పంపకపోవడం ఏమిటని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. బహుశా అధికారుల తొందరపాటు కారణంగా ఈ తప్పు జరిగి ఉండవచ్చని, తప్పును వెంటనే సరిదిద్దాలని కూడా లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఆగస్ట్ 28న ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని రూ.100 నాణెం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల కానుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపిన కేంద్ర ప్రభుత్వం, లక్ష్మీ పార్వతికి ఎలాంటి ఆహ్వానం పంపలేదు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్టీఆర్ సంతానం పురందేశ్వరి, బాలకృష్ణలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement