న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను లేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని, మరోసారి చెబుతున్నానని బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె అన్నారు. బీజేపీని గెలిపిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ పార్టీ ‘బీసీ నినాదం’తో ముందుకెళ్తోందని, ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాను విస్తృతంగా ప్రచారం చేస్తానని చెప్పారు.
తాను పోటీ చేయాల్సిన గద్వాల స్థానంలో కూడా ఓ బీసీ నేతకు అవకాశం కల్పిస్తానని వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బలంగా ఉందన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని డీకే అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అంటే అది బీజేపీతో నే సాధ్యం అని ప్రజలు భావిస్తున్నారని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక స్థితి, ప్రజల జీవన స్థితి మెరుగుపడుతుందని తెలిపారు.
కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇస్తూ తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన జనం ఇప్పటికే చూశారని, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని వారు ఆలోచిస్తున్నారని వెల్లడించారు. బీజేపీ విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తుందని, ఇదివరకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడు సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే చేరారని గుర్తుచేశారు. ఇప్పుడు రాథోడ్ బాపూరావు విషయంలోనూ అదే జరిగిందని అన్నారు.