న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇంకో వంద ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా సరే భయపడేదే లేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. తాను ధర్మం కోసం, నిజం కోసం నిలబడే వ్యక్తినని ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచన్‌బాగ్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో తనపై నమోదైన కేసులపై రాజాసింగ్ స్పందించారు. కంచన్ బాగ్ పోలీసులు తనకు ఫోన్ చేసి కేసు నమోదైనట్టు చెప్పారని, ఎందుకు కేసు నమోదు చేశారో తనకైతే అర్థం కావట్లేదన్నారు. అజ్మీర్‌లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు హిందువులు వెళ్లకూడదని తాను విజ్ఞప్తి చేశానని చెప్పుకొచ్చారు. అనేక ఆలయాలపై దాడులు చేసిన ఘోరీ మహ్మద్ దేశంలోకి అడుగుపెట్టడానికి సహకరించిన వ్యక్తి మొయినుద్దీన్ చిస్తీ అని రాజాసింగ్ విమర్శించారు. అలాంటి వ్యక్తికి కట్టిన దర్గాకు హిందువులు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. తానే మత విశ్వాసాలను కించపరచలేదని స్పష్టం చేశారు. హిందువులందరూ తప్పనిసరిగా ఇటీవల విడుదలైన సామ్రాట్ పృధ్వీరాజ్ సినిమా చూడాలని ఆయన సూచించారు. మొఘల్స్ దండయాత్రల్లో 5 వేల దేవాలయాలు ధ్వంసమయ్యాయని చరిత్రకారులు చెబుతున్నారని, ఇంకొంత మంది వాదన ప్రకారం 40 వేలకు పైగా గుళ్లను ధ్వంసం చేశారని వివరించారు. వాటన్నింటి గురించి తామిప్పుడు మాట్లాడ్డం లేదన్న రాజాసింగ్… కేవలం అయోధ్య, వారణాశి, మథుర గురించి మాత్రమే మాట్లాడుతున్నామని, కొట్లాడుతున్నామని వెల్లడించారు.
నిజం మాట్లాడితే కేసులు..
అనంతరం ఆయన నుపుర్ శర్మ వివాదంపై స్పందిస్తూ…. ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమన్నారు. పార్టీ ఆమెపై చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని దేశాల్లో సూపర్ మార్కెట్లలో భారతదేశ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తున్నారంటే వారి అసలు ఉద్దేశం వేరే ఉందనే విషయం అర్థమవుతోందన్నారు. అయోధ్య, వారణాశి, మథురలో మసీదుల జోలికి వెళ్లొద్దని ఆ దేశాలు పరోక్షంగా సంకేతాలిస్తున్నాయని రాజాసింగ్ ఆరోపించారు. వాటికి మనదేశంలో ఉన్న కొన్ని శక్తులు వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదుల దేశమైన పాకిస్తాన్ భారత్‌పై చేసే కామెంట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై గతంలోనూ 60-70 కేసులు పెట్టారని, వాటన్నింటినీ ఎదుర్కొన్నాననని, వాటన్నిటి నుంచి బయటపడ్డానని రాజాసింగ్ వివరించారు. నిజం మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే అంతిమ విజయం నిజానిదేనని, ఏ కేసూ నిలబడేది కాదని రాజాసింగ్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.