Friday, November 22, 2024

సిబ్బంది సంక్షేమంకై నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏవీ రంగనాథ్

పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అన్నివేళలా అందుబాటులో వుంటానని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ఆర్మూడ్ రిజర్వ్ మరియు హోంగార్డ్స్ సిబ్బంది స్థానిక భీమారంలో శుభం కళ్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఆర్మూడ్ రిజర్వ్ హోంగార్డ్స్ సిబ్బందికి సంబంధించిన శాఖపరమైన సమస్యలు తెలుకోనేందుకు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో పాల్గొని సిబ్బందికి సంబంధించిన శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సిబ్బందితో మాట్లాడుతూ… నక్సల్ నియంత్రణలో వరంగల్ పోలీసులకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, నిబద్దతతో విధులు నిర్వర్తించే వరంగల్ పోలీస్ సిబ్బంది సంక్షేమం పర్యవేక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని, ముఖ్యంగా సిబ్బందికి గత కొద్ది రోజులుగా పెండింగ్ లో వున్న సరెండర్, టి.ఎ పెండింగ్ బకాయిలకు త్వరలోనే అందుకుంటారని, అలాగే సిబ్బందిని విధుల్లో ఎలాంటి ఇబ్బందులకు కలిగించకుండా, వారికి అవకాశాన్ని బట్టి విధుల్లో కొన్ని వేసులుబాటు కల్పించబడుతుందన్నారు.

ఇకపై ప్రతినెలా సిబ్బంది సంక్షేమ కోసం సంబంధిత అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తానని, అలాగే సిబ్బంది సమస్యలు తన దృష్టికి వచ్చే విధంగా విభాగాల వారిగా వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి వాటి ద్వారా సిబ్బంది తమ సమస్యలను తెలపవచ్చని, సిబ్బంది కోసం సంక్షేమం దృష్ట్యా డాక్టర్లు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సిబ్బందికి రాయితీలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే 40 సంవత్సరాలు పై బడిన సిబ్బంది మాస్టర్ హెల్త్ చెకప్, అకస్మికంగా మరణించే హోంగార్డ్ కుటుంబానికి ఆర్ధిక సాయం క్రింద అందజేసే ఒకరోజు వేతనం పథకాన్ని పునరుద్ధరించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సిబ్బంది ఇకపై శాఖపరమైన ఎలాంటి సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాల్సిందిగా పోలీస్ కమిషనర్ సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో పరిపాలన విభాగం డిసిపి పుష్పా, ట్రైనీ ఐపిఎస్ అంకిత్, అదనపు డిసిపిలు సంజీవ్, సురేష్ కుమార్, ఎసిపిలు నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, ఏ.ఓ ఆర్.కె స్వామి, ఆర్.ఐలు చంద్రశేఖర్, నగేష్, భాస్కర్, సతీష్, కేయూ ఇన్స్స్పెక్టర్ అబ్బయ్య, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శోభన్ తో పాటు పరిపాలన విభాగం సూపరింటెండెంట్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement