Monday, November 18, 2024

ఉక్రెయిన్‌పైకి హైపర్‌ సోనిక్‌.. దాడులను తీవ్రం చేసిన రష్యా

రోజులు గడుస్తున్నా.. సైనిక దళాలు నీరసిస్తున్నా.. దళాధిపతులు ఒక్కొక్కరు నేలకొరుగుతున్నా.. ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్‌ ఎంతమాత్రం వెనక్కి తగ్గడంలేదు. భూతల పోరాటం నెమ్మదించడం, తేలికపాటి వైమానిక దాడులను ఉక్రేనియ్‌ సైన్యం తిప్పికొట్టడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో దాడితీవ్రను పెంచారు. అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన క్షిపణులను రంగంలోకి దించుతున్నారు. ఉక్రెయిన్‌పై మొదటిసారి హైపర్‌ సోనిక్‌ క్షిపణులను రష్యా ప్రయోగించింది. అక్కడి ఆయుధగారాలను ధ్వంసం చేసేందుకు ఈ చర్యకు ఒడిగట్టింది. ఆయుధ నిల్వలు ఉన్న ఈ డెలియాటిన్‌ ప్రాంతం ఉక్రెయిన్‌కు పశ్చిమంగా ఉంది. ‘కింజల్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులు.. ఉక్రెయిన్‌లో ముందుగుండు సామాగ్రి, క్షిపణులు కలిగి ఉన్న భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేశాయి’ అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఈ ప్రాంతం రొమేనియాతో 50 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగి ఉండటం గమనార్హం. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను ప్రారంభించిన దగ్గరి నుంచి ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణులను వాడటం ఇదే మొదటిసారి.

కాగా, రష్యా అధ్యక్షుడు ఈ కింజల్‌ క్షిపణిని ‘ఐడియల్‌ వెపన్‌’గా అభివర్ణించారు. ఇది ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను అధిగమించి, దూసుకెళ్లగలదు. సూపర్‌సోనిక్‌ ఎటాక్‌ను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. శత్రుబలగాలు ఇగ్నాట్‌ స్టోరేజీ సైట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రేనియన్‌ వైమానిక దళ ప్రతినిధి యూరి ధృవీకరించారు. శత్రువులు మా డిపోలను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ మిసైల్‌ రకం గురించి మాకు సమాచారం లేదని చప్పారు. వారి ఆయుధాగారంలోని అన్ని క్షిపణులను మాపై ప్రయోగిస్తున్నారు అని అన్నారు. అసద్‌ పాలనకు మద్దతు ఇవ్వడానికి 2016లో సిరియాలో తన సైనిక ప్రచారంలో రష్యా మొదటిసారిగా ఆయుధాన్ని ఉపయోగించినట్లు నివేదించబడింది.

అయితే ఇది అదే మోడలా కాదా అనేది అస్పష్టంగా తెలియదు. 2016లో అలెప్పో కోసం జరిగిన యుద్ధంలో కొన్ని అత్యంత తీవ్రమైన బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా వందలాది మంది పౌరులు మరణించారు. ఇక రష్యన్‌ దళాలు మారియుపోల్‌లోని ఐరోపాలో అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్‌లో ఒకటైన అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌పై దాడులకు దిగాయి. ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రికి సలహాదారు వాడిమ్‌ డెనిసెంకో మాట్లాడుతూ, ‘ఇప్పుడు అజోవ్‌స్టాల్‌ కోసం పోరాటం జరుగుతోంది. ఈ ఆర్థిక దిగ్గజాన్ని మనం కోల్పోయామని చెప్పగలను. నిజానికి, యూరప్‌లోని అతిపెద్ద మెటలర్జికల్‌ ప్లాంట్‌లలో ఒకటి నాశనం చేయబడుతోంది అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement